Suryapet: సూర్యాపేట డీఎస్పీపై బదిలీ వేటు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:37 AM
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ నేత చక్రయ్య హత్య ఘటనలో సూర్యాపేట డీఎస్పీ జి.రవిపై ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీ వేటువేశారు.

కాంగ్రెస్ నేత హత్య ఘటనలో చర్యలు
సూర్యాపేట క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ నేత చక్రయ్య హత్య ఘటనలో సూర్యాపేట డీఎస్పీ జి.రవిపై ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీ వేటువేశారు. ఇప్పటికే తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్‌ను ఐజీ ఆఫీ్‌సకు అటాచ్‌చేయడంతో పాటు నూతనకల్ ఎస్‌ఐ మహేంద్రనాథ్‌కు చార్జ్‌మెమో ఇచ్చారు. డీఎస్పీ రవిని బదిలీచేస్తూ బుధవారం రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. హత్యకు ముందే చక్రయ్య కుటుంబసభ్యులు తమకు ప్రాణహాని ఉందని డీఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చక్రయ్య హత్యకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, చక్రయ్య హత్య కేసులో ఇప్పటివరకు 34ని మంది పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు తుంగతుర్తి కోర్టులో లొంగిపోగా, ఈనెల 24న 13 మందిని, 25న మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనునాయక్ వెల్లడించారు. చక్రయ్య హత్యకేసులో కుమార్తెలు, అల్లుళ్లు, వారి కుటుంబసభ్యులే ప్రధాన నిందితులుగా ఉన్నారు.