Road Accident: రక్తసిక్తమైన రహదారులు
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:08 AM
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ఐదుగురు వలస కూలీల మృతి.. అంతా ఒడిశా వారే
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
మృతులంతా ఒడిశాకు చెందిన వారే
చివ్వెంల, కొడకండ్ల, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, 10మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ మహిళ, వృద్ధుడు, డ్రైవర్ ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశాలోని కోరాపూట్ జిల్లాకు చెందిన 32 మంది భవన నిర్మాణ కార్మికులు సొంతూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీయించారు.క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలను ప్రొక్లెయినర్ల సహాయంతో పక్కకు తొలగించారు. టైరు పేలడంతో లారీని రోడ్డు పక్కకు నిలిపే సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని తెలుస్తోంది. మంచు కురుస్తుండటం, బస్సు డ్రైవర్ అతివేగంగా రావడంతోనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
జనగామ జిల్లాలో ప్రమాదం.. ఇద్దరి మృతి
జనగామ జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప రేకుల లోడ్‌తో ఉన్న డీసీఎం వాహనాన్ని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన పేరాల వెంకన్న(45), పేరాల లక్ష్మి(35)లు అక్కడికక్కడ మృతిచెందగా పేరాల ఉషయ్య, లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలు, వంగూరి నరసమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో డోలారోహణ వేడుకలకు హాజరై తుఫాన్ వాహనంలో తిరిగి వెళ్తుండగా అర్ధరాత్రి కొడకండ్ల మండలంలోనిమైదం చెరువుతండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.