Postal Savings: రూ. 79లక్షల నిధుల దుర్వినియోగం... బీహెచ్‌ఈఎల్ సబ్ పోస్ట్‌మాస్టర్‌కు రెండేళ్ల జైలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:10 AM
పోస్టల్ సేవింగ్స్ ఖాతాదారులకు చెందిన రూ.79లక్షల నిధులను దుర్వినియోగం చేసిన బీహెచ్‌ఈఎల్ సబ్ పోస్ట్‌మాస్టర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పోస్టల్ సేవింగ్స్ ఖాతాదారులకు చెందిన రూ.79లక్షల నిధులను దుర్వినియోగం చేసిన బీహెచ్‌ఈఎల్ సబ్ పోస్ట్‌మాస్టర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్ టౌన్‌షి్‌పలో ఉన్న పోస్టాఫీసులో పనిచేసిన కోళ్ల రామకోటయ్య ఖాతాదారుల డబ్బుకు ఎంట్రీ చేస్తూ, పోస్టల్ రికార్డుల్లో ఆ మొత్తాన్ని నమోదు చేసేవాడు కాదు. ఖాతాదారులు తమ సొమ్మును అడిగినపుడు పాస్‌బుక్ ఆధారంగా ఇచ్చేవాడు. పొదుపు చేసుకునే వారు ఎక్కువ, డబ్బు వెనక్కి తీసుకునే వారు తక్కువ కావడంతో అతని మోసం బయటపడలేదు. ఐదేళ్ల తర్వాత 2008లో పోస్టల్ ఆడిట్‌లో విషయం బయపడింది.
పోస్టల్ ఉన్నతాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీబీఐ వేలాది పాస్‌పుస్తకాలను జల్లెడ పట్టి రూ. 79.79లక్షలను రామకోటయ్య తన సొంతానికి వాడుకున్నట్లు గుర్తించి అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇటీవల పూర్తికావడంతో సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం రామకోటయ్యకు రెండేళ్ల జైలుశిక్ష, రూ. 80వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.