మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు: కేటీఆర్
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:09 AM
కేటీఆర్ మిస్ వరల్డ్ పోటీల కోసం రూ.54 కోట్లు ఖర్చు పెట్టబోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన ఫార్ములా-ఈ కారు ఈవెంట్‌ను రద్దు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.

హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ పోటీలకు రూ.54 కోట్లు ఖర్చు పెట్టబోవడం తప్పుకానప్పుడు.. గతంలో తాము రూ.46 కోట్లతో ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించడం కూడా తప్పు కాదని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ కారు ఈవెంట్‌ను రేవంత్ సర్కారు చాలా మూర్ఖంగా రద్దు చేసిందని విమర్శించారు. దాని వల్ల ఖజానాకు రూ.46 కోట్ల నష్టం జరిగిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీరు లేక అప్పుల పాలై 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని, అదే సమయంలో ఏదో సాధించామన్నట్లు మిస్ వరల్డ్ పోటీలను అట్టహాసంగా నిర్వహించబోతోందని విమర్శించారు. ఫార్ములా-ఈ వలన రాష్ట్రానికి ఎలకా్ట్రనిక్స్ రంగంలో అనేక పెట్టుబడులు వచ్చాయని, మిస్ వరల్డ్ పోటీలతో ఆదాయం, పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టీవోటీ పద్ధతిలో 33 ఏళ్లకు లీజుకు ఇస్తే తప్పన్నారని, కానీ పర్యాటక విధానంలో 99 ఏళ్లకు ప్రభుత్వ ఆస్తులు లీజుకు ఇస్తున్నారన్నారని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిస్తూ ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్లలో బీఆర్‌ఎస్ అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అన్ని వనరులు, ఆదాయం ఉన్నా అనుకున్నంత స్థాయిలో రాష్ట్రాన్ని గత పాలకులు పదేళ్లపాటు అభివృద్ధి చేయలేదన్నారు. అంబేడ్కర్‌పై బీఆర్‌ఎ్‌సకు నిజంగా ప్రేమ ఉంటే విగ్రహం పెట్టేందుకు పదేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.