Share News

Fine Rice: సన్నబియ్యం వచ్చేస్తున్నాయ్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:00 AM

సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సన్నబియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు.

Fine Rice: సన్నబియ్యం వచ్చేస్తున్నాయ్‌

  • గోదాముల నుంచి డిపోలకు బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభం

  • 29కల్లా అన్నిచోట్లకూ చేర్చే ప్రణాళిక.. ఏప్రిల్‌ కోటా 2 లక్షల టన్నులు

  • ఉగాది నుంచి సన్నబియ్యం.. సాగర్‌ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు

  • గత ప్రభుత్వం నీటి వాటాను సరిగా వినియోగించుకోలేదు

  • త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పనులు తిరిగి ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఉగాది రోజు నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రేషన్‌ డిపోలకు సన్నబియ్యం వచ్చేస్తున్నాయి. గోదాముల్లో(ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు) నిల్వ ఉన్న సన్న బియ్యాన్ని చౌక డిపోలకు చేర్చే ప్రక్రియను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదివారం ప్రారంభించింది. సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సన్నబియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉన్న గోదాముల నుంచి.. చౌకడిపోలకు బియ్యాన్ని తరలించారు. సోమవారం నుంచి ఇతర జిల్లాల్లో కూడా సన్నబియ్యం రవాణా ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి చౌక డిపోల్లో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి మార్చి 30, ఉగాది రోజునే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు. దీంతో మార్చి29 కల్లా రాష్ట్రంలోని అన్ని చౌకడిపోలకు సన్నబియ్యాన్ని చేర్చడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఏప్రిల్‌ నెల కోటాకు సుమారు 2 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని సర్దుబాటు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సన్నబియ్యం లేకపోతే.. ఇతర జిల్లాల నుంచి తరలించి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చి రైతుల నుంచి సన్నాలు సేకరించింది. గత వానాకాలంలో ప్రభుత్వం 54 లక్షల టన్నుల ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. రైస్‌మిల్లర్లు 36 లక్షల టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ఇప్పటిదాకా 12 లక్షల టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది. పీడీఎస్‌ అవసరాలకు ప్రతి నెలా 2 లక్షల టన్నుల బియ్యం అవసరం. వానాకాలంలో సేకరించిన ధాన్యం వార్షిక కోటాకు సరిపోయే పరిస్థితి లేదు. దీంతో యాసంగి సీజన్‌లో సేకరించే ధాన్యం నుంచి మిగిలిన బియ్యం ప్రొక్యూర్మెంట్‌ చేసేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పీడీఎస్‌ ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని ‘బలవర్దక బియ్యం’(ఫోర్టిఫైడ్‌ రైస్‌) రూపంలోనే ఇవ్వనున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు7లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, ఇదివరకు పంపిణీ చేసినట్లుగానే.. ఆహారఽభద్రత కార్డుల్లో సభ్యులుగా ఉన్నవారికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇది వరకు రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌ కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఇటీవల కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

Updated Date - Mar 24 , 2025 | 04:00 AM