LRS: ‘ఎల్‌ఆర్‌ఎస్’ రాయితీ గడువు పెంపు!?
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:42 AM
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ.

ఎల్లుండితో ముగియనున్న గడువు
దరఖాస్తుదారుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఏప్రిల్
నెలాఖరు దాకా పెంచాలని సర్కారు యోచన!
గత 15 రోజుల్లో రూ.950 కోట్ల ఆదాయం
31లోపు మరో 500 కోట్లు వస్తుందని అంచనా
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ.. రుసుములో 25% రాయితీ ఇవ్వడంతో ఊపందుకుంది. అయితే గడువు దగ్గరపడడంతో దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. రాయితీ గడువును నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏప్రిల్ నెలాఖరు వరకు రాయితీ గడువు పెంచాలని సభలో ప్రభుత్వాన్ని కోరారు. దరఖాస్తుదారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కింద 25.68 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 20 లక్షల మందికి రుసుము చెల్లించాలంటూ లేఖలు పంపారు.
పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం 25 శాతం రాయితీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 వరకు రాయితీ పథకం అమల్లో ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులకు సమాచారం పంపారు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. రెండు వారాల నుంచి ఫీజు చెల్లించడానికి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డీటీసీపీ దేవేందర్‌రెడ్డి చెప్పారు. నాలుగేళ్లలో ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.112 కోట్లు చెల్లిస్తే.. గత 15 రోజుల్లో 2.80 లక్షల మంది రూ.950 కోట్ల రుసుము చెల్లించారు. 31 వరకు మరో రూ.500 కోట్లకు పైగా రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించడంతో రానున్న రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మరింత వేగిరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ ఆఖరు వరకు రా యితీ పొడిగిస్తే మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు.