Harish Rao: అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ కథను ముగించే కుట్ర
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:41 AM
అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం రుణమాఫీ కథను ముగించే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
అసెంబ్లీలో హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం రుణమాఫీ కథను ముగించే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి మాటలు విని రూ.2 లక్షలకన్నా ఎక్కువున్న రుణాలను రైతులు అప్పులు చేసి మిత్తితో సహా బ్యాంకులకు చెల్లించారని తెలిపారు. అలాగే రూ.2 లక్షలలోపు రుణాలు తమకెప్పుడు మాఫీ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. అయితే రూ.2లక్షలపైన ఉన్న రుణాలను మాఫీ చేయబోమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయిందన్నారు. రూ.2లక్షలలోపు, రూ.2లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ నిలదీస్తూనే ఉంటుందని చెప్పారు.
మా కోసం కొట్లాడండి: ఆటో కార్మికులు
‘ఆటో కార్మికులను ఆదుకుంటామన్నారు. అధికారంలోకి వస్తే రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని నమ్మించారు.. ఇప్పుడు మోసం చేశారు. మాకోసం కాంగ్రెస్ సర్కారుతో కొట్లాడండి’ అని హరీశ్‌రావును ఆటో కార్మిక యూనియన్ నాయకులు కోరారు. శనివారం ఆయన నివాసంలో కలిసిన ఆటో కార్మికులు తమ సమస్యలను వివరించారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్లో ఆ ఊసెత్తలేదన్నారు. తమ కష్టాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ వారు వినతిపత్రం ఇచ్చారు.