Share News

Harish Rao: గజ్వేల్‌పై రేవంత్‌ది సవతితల్లి ప్రేమ

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:28 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ నియోజకవర్గంపై తన విమర్శలు వ్యక్తం చేస్తూ, కేసీఆర్‌కు కన్నతల్లి ప్రేమ ఉందని, రేవంత్‌రెడ్డికి మాత్రం సవతితల్లి ప్రేమ ఉన్నదని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన దీక్షను సత్యమా లేక నటనా? అంటూ ప్రశ్నించారు.

Harish Rao: గజ్వేల్‌పై రేవంత్‌ది సవతితల్లి ప్రేమ

  • మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌, హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గజ్వేల్‌ నియోజకవర్గంపై మాజీ సీఎం కేసీఆర్‌కు కన్నతల్లి ప్రేమ ఉంటే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిది సవతితల్లి ప్రేమ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గజ్వేల్‌లోని మదీనా మసీదులో సోమవారం జరిగిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గ్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌పై రేవంత్‌రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడూ... ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఏడుపే ఉందన్నారు.


గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన రూ.181 కోట్ల పనులను రద్దు చేశారని, గతంలో తాము మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు రూ.1200కోట్లు ఇచ్చామని, గతంలో భూనిర్వాసితుల కోసం దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి 15 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదని, నాడు దీక్ష చేసింది.. నిజమా? లేక నటనా? చెప్పాలని ప్రశ్నించారు. నిజమైన దీక్ష అయితే వెంటనే మిగిలిపోయిన పరిహారం, ప్యాకేజీ ఇవ్వాలన్నారు. కాగా, రేవంత్‌ రెడ్డి ఫ్లైట్‌ మోడ్‌ సీఎం అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 03:28 AM