Harish Rao: తెలంగాణ.. తిరోగమనం!
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:29 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పరుగులు తీసిన రాష్ట్ర ప్రగతి రథానికి రేవంత్‌రెడ్డి మార్క్ పాలన స్పీడ్ బ్రేకర్‌లా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. టాప్‌గేర్ నుంచి రాష్ట్రం క్రమక్రమంగా రివర్స్ గేర్‌లో పడే ప్రమాదం కనిపిస్తోందన్నారు.

అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్‌లా రేవంత్ పాలన
బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదు
జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్‌లెస్ క్యాలెండర్
ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100ు అయిందా?
మొహబ్బత్ కీ దుకాన్ కాదు.. నఫ్రత్ కా మకాన్
సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి
ఎక్కడాలేని మాంద్యం తెలంగాణలోనే ఎందుకు?
మా హయాంలో అప్పు రూ.4.22 లక్షల కోట్లే
గ్రామాల నుంచి మండలాలకు మేం రోడ్లు వేశాం
బడ్జెట్‌పై చర్చలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పరుగులు తీసిన రాష్ట్ర ప్రగతి రథానికి రేవంత్‌రెడ్డి మార్క్ పాలన స్పీడ్ బ్రేకర్‌లా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. టాప్‌గేర్ నుంచి రాష్ట్రం క్రమక్రమంగా రివర్స్ గేర్‌లో పడే ప్రమాదం కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ మాయమాటలు ఎక్కువకాలం నిలవవని, వారి కుటిల నీతి ప్రజలకు అర్థమైందన్నారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ కీ దుకాన్ (ప్రేమలు పంచే వేదికలు) అంటుంటే.. రేవంత్ తన పాలనతో నఫ్రత్ కా మకాన్ (విద్వేషపు ఇల్లు)గా మార్చారు. ఇందిరమ్మ రాజ్యం వస్తదంటే జనం ఏమో అనుకున్నరు. చివరికి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. 6 గ్యారంటీల అమలేమో గానీ.. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు’ అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్‌ను ఎన్నుకున్న ఒకే ఒక ఎర్రర్ కారణంగా టెర్రర్‌ను చవిచూపిస్తున్నారంటూ ఆక్షేపించారు. శుక్రవారం శాసనసభలో 2025-26 బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘బడ్జెట్‌లోని 72 పేజీలు, 500 పేజీల పెన్‌డ్రైవ్‌లోని అంశాలన్నీ చదివాను. ఎన్నికల ముందు నో ఎల్‌ఆర్‌ఎస్, నో బీఆర్‌ఎస్ అని పిలుపునిచ్చి.. అధికారంలోకి రాగానే ముక్కు పిండి ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వ భూములను అమ్ముతుంటే.. భూములు పెద్దలిచ్చిన ఆస్తి అని, అమ్మవద్దని అన్నరు. ఇవాళ మాత్రం అమ్మేస్తున్నరు. గత బడ్జెట్‌లో 4.5 లక్షల ఇళ్లు కడతామని చెప్పి.. నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్ అయింది. ఆరు పెండింగ్ ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తికాలేదు. బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదు’’ అని హరీశ్ ధ్వజమెత్తారు. మహిళలకు వడ్డీలేని రుణం ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు బతుకుదెరువు కల్పించాలి..
బడ్జెట్ అంటే ప్రజలకు బతుకుదెరువు కల్పించాలని, వారి బాధలు తీర్చాలని హరీశ్‌రావు అన్నారు. కానీ, తాజా బడ్జెట్‌లో అంకెలు చూేస్త ఆర్భాటం.. పనులు చూస్తే డొల్లతనం అని ఆక్షేపించారు. ‘‘ఆదాయాన్ని పెంచుతాం.. హామీలన్నీ నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల్ని నమ్మించారు. కానీ, 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు. ఇది నిరాశాజనకమైన బడ్జెట్. కాంగ్రెస్ విఫల పాలనతో రాష్ట్ర ఆదాయం అంతకంతకూ క్షీణిస్తోంది. అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములు అమ్ముడు. ఇదే మీ మార్కు పాలన’’ అని హరీశ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అహంకారం, అనాలోచిత నిర్ణయాలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడిందని ఆరోపించారు. పదేళ్ల తమ పాలనలో అన్నిరంగాల్లో వృద్ధి నమోదయిందని, కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో వాహనాల అమ్మకం తగ్గిందని, జీఎస్టీ వృద్ధిరేటు తగ్గిందని తెలిపారు. ‘‘దీనికి కారణం ఆర్థిక మాంద్యమా, లేక మీ బుద్ధి మాంద్యమో ఆత్మవిమర్శ చేసుకోండి’’ అని హితవు పలికారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రకటించడ మే ఇందుకు నిదర్శనమన్నారు.
భయానక వాతావరణం సృష్టించినందునే..
ఆర్థిక క్షీణతను దివాళా అని ప్రచారం చేయడం, ఫార్మాసిటీ రద్దు, హైడ్రా పేరిట కూల్చివేతలు, భయానక వాతావరణం సృష్టించడం.. సంక్షేమ పథకాల ద్వారా సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమేనని హరీశ్‌రావు అన్నారు. ‘‘స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీలో రుణమాఫీకి రూ.49,500 కోట్లు కావాలని చెప్పారు. ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే రూ.41 వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ అవుతాయని చెప్పారు. గత బడ్జెట్ ప్రసంగలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయని చెప్పి రూ.20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. సిద్దిపేటలో 43,363 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే 20,514 మందికే రుణమాఫీ అయింది. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులే 10 వేల దాకా ఉన్నారు. ఏ ఒక్క ఊరుకైనా వెళ్లి.. వందశాతం రుణమాఫీ జరిగిన ట్లు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధం’’ అని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 289 గురుకులాలుఉంటే.. తాము వాటిని 1020కి పెంచామని, విద్యార్థుల సంఖ్యను 1.50 లక్షల నుంచి 6 లక్షలకు చేర్చామన్నారు. కానీ, 15 నెలల్లో 83 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వెయ్యికిపైగా పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని చెప్పి.. 5 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారని ఆరోపించారు.
ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించలేదు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 15 నెలల్లో ఒక్కరూపాయి కూడా చెల్లించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా తమ హయాంలో పూర్తయితే.. నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి, 57 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో రోడ్ల కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ తెస్తున్నామన్నారని, గ్రామాల్లో కూడా టోల్ గేట్లు పెడతారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో తాముచేసిన అప్పు రూ.4,22,674 కోట్లు మాత్రమేనన్నారు. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారని, లోపల ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. అడ్డగోలుగా మాట్లాడొద్దని, అలా అయితే తమ సభ్యులు కూడా ఊరుకోరని హెచ్చరించారు. కాగా, ప్రజా సమస్యలపై శాసనసభలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని హరీశ్‌రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి అందాల పోటీలు ముఖ్యం కాదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిధులిప్పిస్తామంటే మూసీపై చర్చకు రెడీ: మంత్రి పొన్నం
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవనానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామంటే కచ్చితంగా దానిపై చర్చ పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో శుక్రవారం చర్చలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ పునర్జీవనంపై చర్చ పెట్టాలన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ గుజరాత్‌లో సబర్మతి తరహాలోనే తెలంగాణలో మూసీ నదిని రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అధ్యయనం జరిపి వచ్చామని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా చాలా మందిని తరలించామని, వారందరికీ పునరావాసం కల్పించడంతోపాటు ఆర్ధిక సాయం కూడా అందజేశామన్నారు.
హరీషన్నా.. ఏంటి సంగతులు..
‘ఏం హరీషన్నా.. ఏంటి సంగతులు’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును మంత్రి పొన్నం ప్రభాకర్ పలకరించారు. శుక్రవారం మంత్రి పొన్నం.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బెంచ్‌ల వైపు వెళ్లారు. అక్కడికి వెళ్లి హరీ్‌షరావుతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ సంభాషణలో పరస్పరం జోకులు వేసుకోవడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి.
అక్కా.. నమస్తే
‘అక్కా నమస్తే’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునితాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నమస్కరించారు. సునితా లక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి కుర్చీల దగ్గరకే మంత్రి పొన్నం వెళ్లారు. దీంతో సునిత, సబితలతోపాటు మంత్రి పొన్నం నిలబడే కొద్దిసేపు ముచ్చట్లు పెట్టారు. ఆ తరువాత వెళ్లొస్తానని వారితో చెబుతూ మంత్రి పొన్నం తన కుర్చీ దగ్గరకు వెళ్లారు.