గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు టెండర్‌పై యథాతథ స్థితి
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:53 AM
ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానం చేసేలా నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు టెండర్ నోటీ్‌సపై యథాతథ స్థితి (స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ
భూసేకరణ పూర్తికాకుండానే టెండర్ నోటీస్ ఇవ్వడంపై పలువురి పిటిషన్
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానం చేసేలా నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు టెండర్ నోటీ్‌సపై యథాతథ స్థితి (స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ వ్యవహారం ప్రాథమిక దశలో ఉండగానే రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవడం అన్యాయమంటూ మదీనాగూడ మైత్రినగర్‌కు చెందిన శిల్పా రియల్ వ్యాల్యూ ప్రాపర్టీస్, నీరటి రవీందర్ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తమ వాదనలు కూడా వినలేదని.. అయినా భూసేకరణ పూర్తయినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.
ఓఆర్‌ఆర్ రావిర్యాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్ ఆమన్‌గల్ (రతన్ టాటా రోడ్డు) వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన ప్రైవేటు భూముల సేకరణకు సాధారణ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. భూసేకరణ చట్టం సెక్షన్ 11 కింద గతేడాది అక్టోబరు 28న భూయజమానులకు నోటీసులు అందజేశారని.. అయితే చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం ఇంకా భూయజమానుల వాదనలు వినే ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. ఈలోపే టెండర్ నోటీసు ఇవ్వడమంటే భూసేకరణ ప్రక్రియను అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. యజమానుల అభ్యంతరాలను తిరస్కరించినట్టే భావించి.. భూసేకరణ పూర్తయిందనుకుని టెండర్ వరకు వెళ్లారని.. భూసేకరణ ప్రక్రియను మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు టెండర్ నోటీ్‌సపై యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.