Hyderabad: దుస్తులు విప్పించి.. రోడ్డుపై నగ్నంగా నిలబెట్టి..
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:51 AM
భార్యాభర్తల గొడవ విషయంలో మధ్యవర్తిగా మాట్లాడటానికి వెళ్లిన యువకుడిపై కొందరు దాడికి దిగారు. దుస్తులు విప్పించి, నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో, పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
భార్యాభర్తల గొడవలో మధ్యవర్తిగా.. మాట్లాడేందుకు వెళ్లిన యువకుడిపై దాడి
తీవ్రంగా కొట్టి.. పాదాలు నాకించి దుర్మార్గం
పైగా వీడియో తీసి వైరల్ చేసిన తీరు
పేట్ బషీరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
పేట్ బషీరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల గొడవ విషయంలో మధ్యవర్తిగా మాట్లాడటానికి వెళ్లిన యువకుడిపై కొందరు దాడికి దిగారు. దుస్తులు విప్పించి, నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియోలు తీసి స్నేహితులకు పంపి వైరల్ చేశారు. ఎలాగోలా వారి చెర నుంచి బయటపడిన యువకుడు ఆస్పత్రిలో చేరాడు. ఆ యువకుడిపై దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాఽధితుడి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన అనీషా, వినీత అక్కాచెల్లెళ్లు. వీరిలో వినీతకు గుండ్లపోచంపల్లికి చెందిన కిరణ్‌యాదవ్‌తో వివాహం జరిగింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలతో.. వినీత సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని, కిరణ్‌యాదవ్‌కు నోటీసు పంపింది.
కానీ తర్వాత మనసు మార్చుకుని భర్తతో కలసి ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన సోదరి అనీషాకు చెప్పింది. దీంతో మధ్యవర్తిత్వం వహించి ఈ విషయాన్ని కిరణ్‌యాదవ్‌కు చెప్పాల్సిందిగా... తమ కుటుంబ స్నేహితుడు అఫ్జల్‌గంజ్ ఉస్మాన్‌షాహీకి చె ందిన తరుణ్‌కుమార్‌ను అనీషా, వినీత కోరారు. కిరణ్ తనకు కూడా పరిచయమున్న నేపథ్యంలో తరుణ్ ఇందుకు అంగీకరించాడు. మార్చి 26న రాత్రి పదిన్నర గంటల సమయంలో గుండ్లపోచ ంపల్లిలోని కిరణ్ ఇంటికి వెళ్లాడు. కానీ తన దగ్గరికి ఎందుకు వచ్చావంటూ తరుణ్‌పై కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన స్నేహితులు బోయిన్‌పల్లికి చెందిన జయంత్‌యాదవ్, సుచిత్రకు చెందిన సోహెల్, అంగడిపేటకు చెందిన తరుణ్‌గౌడ్, గుండ్లపోచంపల్లికి చెందిన పవన్‌లతో కలసి.. పదునైన ఆయుధాలు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దుస్తులను విప్పించి నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి కులం పేరుతో బూతులు తిట్టాడు. తన కాళ్లు నాకించుకున్నాడు. ఇదంతా ఫోన్‌లో వీడియోలు తీసి తరుణ్ స్నేహితులకు పంపారు. తీవ్రంగా గాయపడిన తరుణ్.. ఆస్పత్రిలో చేరాడు. తర్వాత ఏప్రిల్ 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులంతా పరారీలో ఉన్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News