Key meeting: సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:19 AM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదితరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం కీలక సమావేశం (Key meeting) నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (local Elections) సమయం దగ్గర పడడంతో సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదితరులు హాజరుకానున్నారు. కాగా సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన పడుతోంది.
బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. బుధవారం జరిగే సమావేశంలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈరోజు సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ వార్త కూడా చదవండి..
GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం..
ముఖాముఖీ కార్యక్రమం
కాగా గాంధీ భవన్లో మంత్రులతో జరిగే ముఖాముఖీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. చాల రోజుల గ్యాప్ తర్వాత ముఖాముఖీ కార్యక్రమం జరగనుంది. కాగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గాంధీ భవన్‌కు చాలా మంది వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ఏవిధంగా ఇసుక సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌తో ఓ అధ్యయన కమిటీని నియమించారు. వారంలోపు అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా... గనుల శాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల గనులపై వేసిన జరిమానాల వసూళ్లపై ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. సమీక్షలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
తక్కువ ధరకే..ఇచ్చే యోచన
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంటును లబ్ధిదారులకు తక్కువ ధరలే ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఇనుము, ఇసుక అవసరం అనే అంచనాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇళ్ల నిర్మాణానికి దాదాపు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి 9 మెట్రిక్ టన్నుల సిమెంటు చొప్పున, 40.50లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, ఒక్కో ఇంటికి 1.5 మెట్రిక్ టన్నుల చొప్పున సుమారు 68లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక సరఫరా విధానంపై కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News