Hyderabad: ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:32 PM
ఎన్టీఆర్ స్టేడియంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన ఆ దుర్మార్గులు మనసు కలిచి వేసే సంఘటనకు పాల్పడ్డారు. ఛీ.. మీరసలు మనుషులేనా అనిపించేలా.. అప్పుడే పుట్టిన పసికందుపై దారుణానికి పాల్పడ్డారు.

మానవత్వం మంటగలిసిపోతోంది. టెక్నాలజీ పరంగా మనిషి ఎంత అభివృద్ధి సాధించినా .. కొన్ని విషయాల్లో ఇంకా వెనుకబడిపోతున్నాడు. తెలివిలేని మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో రాక్షసుడిలా మారిపోతున్నాడు. మురికి కాలువలలో, ముళ్ల పొదలలో దారుణమైన స్థితిలో ప్రాణాలతో బయటపడ్డ పసికందులు కొందరైతే.. ఆఖలి బాధతో చనిపోయిన వారు మరికొందరు. ఆడపిల్ల పుడితే నోట్లో వడ్లు పోసి చంపేసిన ఘటనలు గతంలో దేశంలో లెక్కలేనన్ని జరిగాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి అనుకుంటున్న టైంలో దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో మనసు కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తగులబెట్టేశారు. సమాచారం అందుకున్న దోమల్ గూడ పోలీసులు స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరించారు.
పసికందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పసికందును బతికుండగానే కాల్చేశారా?.. లేక మృతి చెందిన తర్వాత స్టేడియంలోకి తీసుకువచ్చి కాల్చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన పసికందు ఆధారాలు లేకుండా చేయడానికి అక్కడికి తీసుకువచ్చి తగులబెట్టారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, గత జనవరి నెలలో పంట కాలువలో పసికందు శవం వెలుగు చూసింది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన ఆ పసికందు.. పంట కాలువలో శవమై కొట్టుకొచ్చింది. కాలువలో కొట్టుకొస్తున్న పసికందు శవాన్ని స్థానికులు బయటకు తీశారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కౌసల్యాబాయి, అంగన్‌వాడీ కార్యకర్తలు పసికందు మృతదేహాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవయవాలు కూడా పూర్తిగా ఏర్పడకపోవటంతో ఆ పసికందు ఆడా,మగా అన్నది తెలియలేదు.
ఇవి కూడా చదవండి...
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్
Read Latest Telangana News And Telugu News