HYDRA: డిఫెన్స్‌కాలనీ పార్క్ స్థలంలో.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:18 AM
హైదరాబాద్ నేరేడ్‌మెట్ డివిజన్ డిఫెన్స్‌కాలనీ పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మంగళవారం హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టి.. నిర్మాణాలతోపాటు.. రేకుల షీట్లను తొలగించారు.

కాలనీ సంఘం ఫిర్యాదుతో హైడ్రా చర్యలు
అది పార్క్ స్థలం కాదు: సొసైటీ మాజీ కార్యదర్శి
నేరేడ్‌మెట్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నేరేడ్‌మెట్ డివిజన్ డిఫెన్స్‌కాలనీ పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మంగళవారం హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టి.. నిర్మాణాలతోపాటు.. రేకుల షీట్లను తొలగించారు. కొందరు వ్యక్తులు సర్వేనంబర్ 218/1లోని ఈ స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా నిర్మాణాలు జరిపినట్లు డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి, పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిపింది. రూ.కోట్లు విలువ చేసే స్థలాన్ని కాపాడడంపై హైడ్రాను కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అభినందించారు.
అయితే.. హైడ్రా కూల్చివేతలు అక్రమమని డిఫెన్స్ కాలనీ సొసైటీ మాజీ కార్యదర్శి శివయ్య ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు జరిపిన నిర్మాణాలు సర్వే నంబరు 205లో ఉన్నాయని, 218/1లో కాదని, ఆ స్థలాన్ని రక్షణ శాఖ నుంచి సొసైటీ తీసుకుందని పేర్కొన్నారు. ఆ స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గతంలోనే సొసైటీ నిర్ణయించిందని, ఆ మేరకు డెవల్‌పమెంట్ కోసం బిల్డర్‌కు అప్పగించిందని వివరించారు.