Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:40 PM
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

గత కొద్దిరోజుల నుంచి వాతావావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల ముందు వరకు ఎండలు దంచికొట్టాయి. 40 డిగ్రీలకుపైనే ఎండలు పెట్టాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఎండలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు. పంటనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు,
భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు తగ్గిన తర్వాత మళ్లీ ఎండలు దంచికొడతాయని, 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అంది. ఉత్తర కోస్తా , యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. తర్వాతినుంచి ఎండలు మరింత పెరుగుతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తర్వాతినుంచి ఎండలు పెరుగుతాయి.
ఇక, రాయలసీమలోనూ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి ఎండలు రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. కాగా, అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో.. దాదాపు 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు వివరించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Uddhav Thackeray: ద్రోహి అనడం తప్పు కాదు... కునాల్‌ను సమర్ధించిన ఉద్థవ్ థాకరే
Window XP Wallpaper: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్