గ్రామీణ సంపద సృష్టికి అరుదైన సంకల్పం
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:17 AM
‘తెలంగాణలో అరుదైన వృక్ష జాతులకు అనుకూలమైన అటవీ ప్రాంతం... ఆంధ్రాలో జీవవైవిధ్యం నిండిన తూరుపు కనుమలలో అపార మైన సహజవనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే సంపదను పెంచుకోవచ్చు’ అంటారు ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువకాలం పనిచేసి, అక్కడి సహజ వనరులపై అధ్యయనం చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వి.ఎం.మనోహర ప్రసాద్. చెప్పడమే కాదు, ఎలాచేయాలో చేసి చూపించారు. ఆ విశేషాలే ఇవి...
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల బీడు భూములు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో నల్లతుమ్మ, మద్ది, కొంకుడు, కిత్తనార పెంచుకోవడానికి భూమిలేని పేదలకు అవకాశం ఇస్తే సహజ వనరులు అభివృద్ధి చెందడమే కాక సంపదను సృష్టించి పేదల జీవనోపాధిని పెంచవచ్చు.
తుమ్మ కొమ్మలను కాల్చి బొగ్గుగా మారిస్తే అల్యూమినియం పరిశ్రమల్లో డిమాండ్ ఉంది. నల్లమద్ది, తెల్లమద్ది చెట్లపై పట్టుగుడ్ల నుంచి వచ్చే లార్వాను వదిలితే ఆ పురుగులు చెట్ల ఆకులను తింటూ, పెరిగి ఆ చెట్లమీదే పట్టుగూళ్లను అల్లుతాయి. ఇలా ఉత్పత్తి చేసిన గుడ్లను ‘కాకోన్స్’ అంటారు. వాటి నుంచి దసలి పట్టు దుస్తులు తయారవుతాయి. పట్టు సాగు చేసిన రైతుకు సుమారుగా 18 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
అలాగే అగవె (కిత్తనార) అరుదైన ఎడారి మొక్క. కలబంద మొక్కలా పెరుగుతుంది. తోటలకు రక్షణగా సరిహద్దుల్లో నాటుకోవచ్చు. ఆకుల మధ్యలో దాదాపు 10 మీటర్ల ఎత్తులో పొడవాటి కాండం పైకి లేస్తుంది. దానిని వెదురులా అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దాని మట్టల నుంచి తీసిన నారతో తయారయ్యే తాళ్లను నౌకల పరిశ్రమలో వాడతారు. వీటి పెంపకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అందుకే రీజెనరేషన్ ఇంటర్నేషనల్ (Regeneration International) అనే అంతర్జాతీయ సంస్థ అన్ని దేశాల్లో వంద కోట్ల కిత్తనార మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకుంది. పేదరికాన్ని తగ్గించే ఇలాంటి అనేక రకాల చెట్ల పెంపకంపై ‘పీపుల్స్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ రెయిన్ ఫెడ్ ఏరియాస్’ అధ్యయనం చేసింది.
ఆదివాసీలతో కలిసి...
మార్లవాయి (ఆదిలాబాద్ జిల్లా)లో ఉన్నపుడు తన ఆలోచనలకు తగిన మిత్రులు, అక్కడి ఆదివాసీలను కలుపుకొని ఆదివాసీ జీవన వికాసం కోసం 1984లో ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్’ (సి.డి.ఆర్) సంస్థను ఏర్పాటు చేసి, గిరిజన గూడాలలోని పిల్లల విద్య కోసం ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు ప్రసాద్. ‘నిజానికి నేను ఏ పాఠశాల కూడా ప్రారంభించలేదు, అక్కడి గిరిజన తల్లులు చెప్పిన దానికి మాత్రమే స్పందించాను. వారు తమ బిడ్డలకు చదువు కావాలని కోరారు. ఆ పాఠశాలలన్నీ తల్లుల కృషి ఫలితాలు’ అని అన్నారాయన.

2006లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాక, భార్య రమాదేవితో కలిసి ఆదిలాబాద్ జిల్లా, మార్లవాయిలో విద్యకు దూరమైన పిల్లల కోసం మహిళా మండలి సమాఖ్యలతో కలిసి పనిచేశారాయన. గోండు బిడ్డల మనస్తత్వానికి అనువుగా... వారు నివసించే వాతావరణానికి సరిపోయే పాఠ్యాంశాలతో రూపొందించిన సిలబస్‌తో ‘‘మావా నాటే, మావా షాలే’’(మా గ్రామం, మా పాఠశాల)లు కొన్ని నిర్వహించారు.
ఉత్తమ ప్రమాణాల సాధన కేంద్రం
ప్రాథమిక విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, జీవనోపాధుల మెరుగుదలకు అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్లంక అనే కుగ్రామంలో విశాలమైన ప్రాంగణంలో ‘ఉత్తమ ప్రమాణాల సాధన కేంద్రం’ నిర్మించారు. అక్కడి నుంచి 52 గ్రామాల్లో 1900కు పైగా గిరిజన కుటుంబాలతో సి.డి.ఆర్ పనిచేస్తోంది. ఈ ప్రాంతంలో రాగులు, కందులు, అలసందలు అత్యధికంగా పండిస్తారు. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రస్తుత దిగుబడుల కన్నా కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ఉత్పాదకత కోసం ‘గులిరాగి’ విధానం అనుసరించి రాగుల దిగుబడిని పెంచారు. సుగంధ ద్రవ్యాలు సాగుపై అవగాహన కల్పించి, వాటితో పాటు ఔషధ మొక్కలను పెంచుతున్నారు. భీమవరం గ్రామంలో రైతు వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సేద్యపు పనులు చేసుకోవడానికి బ్యాటరీతో నడిచే నానో ట్రాక్టర్, విత్తనాలు నాటే యంత్రాలను సమకూర్చారు.
పండ్లతోటలకు చేయూత
మారేడుమిల్లి మండలం చావడికోట, చట్ల వాడ, గుజ్జుమామిడివలస, వేటుకూరు పంచాయితీలలో ‘నాబార్డ్’ సహకారంతో 488 రైతులతో 488 ఎకరాల్లో పండ్లతోటలు వేయిం చారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించాలంటే చెట్ల పెంపకం అత్యంత విశ్వసనీయ మార్గమని నమ్మే మనోహర్ ప్రసాద్, 1984లో రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, 1994లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, 2002లో నల్గొండ జిల్లా కలెక్టర్‌గా చేసినప్పుడు వేలాది పేద కుటుంబాలకు చెట్లు పెంచే అవకాశం కల్పించారు. రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో 12 వేల మంది గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే జీడిమామిడి తోటల ఏర్పాటులో ఆయన కృషికి 1987లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వృక్ష మిత్ర’ జాతీయ పురస్కారం ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రభుత్వ అధికారి ఆయనే.
- శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి
పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Read Latest Telangana News and National News