నెరవేరిన కల
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:11 AM
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ప్రత్యేక పసుపు బోర్డు కల నెరవేరింది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14వ తేదీన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు.
- నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
- భవిష్యత్తులో సాగుకు మంచి రోజులు
జగిత్యాల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ప్రత్యేక పసుపు బోర్డు కల నెరవేరింది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14వ తేదీన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. నిజామబాద్ పార్లమెంట్ పరిధిలోని అంకాపూర్‌కు చెందిన పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మన్‌గా మూడేళ్ల పదవీ కాలానికి గాను కేంద్రం నియామకం చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, చైర్మన్ పదవిని భర్తీ చేయడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పసుపు సాగయ్యే జిల్లాల సరసన జగిత్యాల జిల్లా ఉంటోంది.
అధికంగా పసుపు సాగు...
జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్లతో పాటు జగిత్యాల డివిజన్‌లోని గొల్లపల్లి, సారంగాపూర్, బుగ్గారం, రాయికల్ తదితర మండలాల్లో పసుపు అధికంగా సాగు చేస్తుంటారు. గతంలో నిజామబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంత రైతులే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం 40 వేల ఎకరాల వరకు సాగవుతోంది. ఇక్కడ పండించిన పంటను జిల్లాలోని మెట్‌పల్లి మార్కెట్ యార్డుతో పాటు కోరుట్ల, జగిత్యాల, గొల్లపల్లి యార్డులతో పాటు నిజామబాద్‌లోని శ్రద్దానంద్ గంజ్‌కు తీసుకవెళ్లి విక్రయిస్తుంటారు. మరికొంత మంది రైతులు మహరాష్ట్రంలోని సాంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లలో ఈ నామ్ పద్ధతిలో విక్రయిస్తున్నారు. క్వింటాలుకు ఐదు వేల రూపాయలకు కాస్త అటుఇటుగా ఉన్న ధర 2023లో ఏకంగా 22 వేల రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాల్‌కు 16 వేల రూపాయల ధర పలుకుతోంది.
- ఎన్నికల నినాదంగా పసుపు బోర్డు...
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలతోపాటు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పసుపు బోర్డు ఏర్పాటు ప్రధాన ఎజెండాగా పార్టీలు ప్రచారాలు చేశాయి. ఆరేళ్ల కిందట నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన దర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ సమయంలో ఉద్యమం ఊపు మీదుండడంతో పార్లమెంటు పరిధిలోని 176 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. గత యేడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పసుపు బోర్డు ప్రచార అస్త్రంగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదిపాయి. ఎట్టకేలకు నిజామబాద్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలోనే ప్రస్తుతానికి జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా కొనసాగించనున్నారు.
- నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంకాపూర్‌కు చెందిన పల్లె గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ బాద్యతలు అప్పజెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీడ్స్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇవీ ప్రయోజనాలు....
- పంటకు నిర్ణీత మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంటుంది.
- పసుపు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
- పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు అవుతాయి.
- పసుపును నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీ కేంద్రాలను నిర్మించే అవకాశాలున్నాయి.
- నాణ్యమైన వంగడాల రూపకల్పనకు పరిశోధనలు జరుగుతాయి.
- సాగులో ఆధునిక పద్ధతుల , యాంత్రీకరణ వైపు అడుగులేస్తారు.
- సాగు ప్రోత్సాహానికి రాయితీలు పెరుగుతాయి.
- మార్కెటింగ్ సౌకర్యాలు వృద్ధి చెందుతాయి.
- కర్షకుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి వేదిక దొరుకుతోంది.
- ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లో ఉండడంతో దేశవ్యాప్తంగా సాగుదారులతో మమేకం అయ్యే అవకాశం ఉంటుంది.