కాంగ్రెస్‌లో వార్నింగ్‌ల వణుకు
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:19 AM
‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు.. తీరును మార్చుకుని కార్యకర్తలను పట్టించుకోండి..’
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు.. తీరును మార్చుకుని కార్యకర్తలను పట్టించుకోండి..’
- టీపీసీసీ రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
‘నేను మారాను.. మీరూ మారండి.. పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ నా దగ్గర ఉంది, పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు’
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పార్టీ అగ్రనేతల హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఇద్దరు నేతల హెచ్చరికలతో షాక్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని, కొందరు పార్టీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఇతర దందాల్లో నిమగ్నమై పార్టీకి నష్టం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న సర్వే రిపోర్టులో ఉందని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా కొందరి పనితీరు బాగా లేదని వెల్లడైనట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఆ కొందరు ఎవరు అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడం మినహా కార్యకర్తలతో సమయమిచ్చి మాట్లాడడం లేదనే విమర్శలున్నాయి. తమను పట్టించుకునే వారే లేరని ద్వితీయ శ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యేల పనితీరు సందర్భంగా వెల్లడైన రిపోర్టులో ఈ అసంతృప్తి గురించి స్పష్టంగా పేర్కొన్నారని, దానిని సీరియస్‌గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలను హెచ్చరించారనే చర్చ జరుగుతోంది. సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైనట్లు తెలిసింది.
ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై నెగెటివ్ రిపోర్టు
ఉమ్మడి జిల్లా పరిధిలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నారు. వీరిలో శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉన్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురి పనితీరుపై నెగెటివ్ రిపోర్టు వచ్చిందని తెలిసింది. అందులో తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కాంగ్రెస్ నేతలు కలిసినా ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నా స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేలు దృష్టిసారించడం లేదని, స్థానిక నేతలతో సమస్యలేమిటి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నాలు జరగడం లేదనే విమర్శలున్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే ఎవరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ఏడాదికాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు కలిసిమెలిసి తిరిగినప్పుడే ఇది సాధ్యమవుతుందని, ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమను పట్టించుకున్నారని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.