Share News

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:52 AM

జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. కోట్లాది రూపాయాల ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌ పెట్టడంతో సేవలను ఆపివేసేందుకు తెలంగాణ రాష్ట్ర నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

- నిలిపివేసిన ప్రైవేట్‌ ఆసుపత్రులు

- ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే కారణం

- ఏడాదిగా నిలిచిన బకాయిల చెల్లింపు

- జిల్లాలో 29 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

జగిత్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. కోట్లాది రూపాయాల ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌ పెట్టడంతో సేవలను ఆపివేసేందుకు తెలంగాణ రాష్ట్ర నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో వైద్యులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, దర్మపురి పట్టణాల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే కోట్లాది రూపాయాల బిల్లులు ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సుమారు కోటి రూపాయలకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. మిగిలిన ఆసుపత్రులకు కూడా కోట్ల రూపాయాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు.

జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులివే..

జిల్లా వ్యాప్తంగా 29 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు మినహా ఏడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గీతా ఆర్థోపెడిక్‌ అండ్‌ మెటర్నిటీ నర్సింగ్‌ హోమ్‌, అమృత త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, పావని కంటి ఆసుపత్రి, ఓం సాయిరాం హాస్పిటల్‌, మెట్‌పల్లిలోని తిరుమల నర్సింగ్‌ హోమ్‌, సాయి సంజీవని హాస్పిటల్‌, కోరుట్ల పట్టణంలోని శివసాయి హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. సమ్మె కారణంగా సంబంధిత ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా...

ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌), జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ (జేహెచ్‌ఎస్‌), ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు జరగకపోవడంతో ఆసుపత్రుల నిర్వాహకులు నిరసనకు దిగారు. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ (తానా) పలు పర్యాయాలు ఆరోగ్యశ్రీ సీఈవో దృష్టికి సమస్యను తీసుకవెళ్లినప్పటికీ పరిష్కారం కావడం లేదని అసోసియేషన్‌ సభ్యులు అంటున్నారు. పెండింగ్‌ బకాయిల వల్ల ఆసుపత్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు.

జిల్లాలో రూ. 6 కోట్లకు పైగా బకాయిలు..

జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు రూ. 6 కోట్లకు పైగానే ఉన్నాయని అంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సుమారు తొమ్మిది నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. అదే విధంగా ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు హయాంలోనూ సుమారు ఏడాది కాలంగా బిల్లుల చెల్లింపులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయని అంటున్నారు. జగిత్యాల జిల్లాలో సుమారు రూ. ఆరు కోట్ల వరకు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గల ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సుమారు రూ. 100 కోట్లు బిల్లులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఆసుపత్రికి సుమారు పది శాతం బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయని సంబంధిత అధికార వర్గాలు అంటున్నప్పటికీ, హైద్రాబాద్‌లో గల పెద్దపెద్ద కార్పోరేట్‌ ఆసుపత్రులకు మాత్రమే అధికశాతం బిల్లులు చెల్లింపులు జరిపారని, జగిత్యాల జిల్లాలోని ఆసుపత్రు లకు ఆరు, ఏడు శాతానికి మించి చెల్లింపులు జరగలేద న్న అభిప్రాయాలను సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Updated Date - Jan 11 , 2025 | 01:52 AM