Share News

సాగు భూములకు ‘రైతు భరోసా’

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:15 AM

సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభలు, దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే రైతుల ఖాతాల్లో వారికున్న భూమికి అనుగుణంగా ఎకరాకు సీజన్‌కు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాగు భూములకు ‘రైతు భరోసా’

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభలు, దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే రైతుల ఖాతాల్లో వారికున్న భూమికి అనుగుణంగా ఎకరాకు సీజన్‌కు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం రైతుబంధు సాయం పేరిట ఎకరాకు సీజన్‌కు ఐదు వేల రూపాయల చొప్పున ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని రైతులు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరాపై అదనంగా రెండు వేల రూపాయలు లబ్ధి పొందనున్నారు. ఏటా ఎకరాకు 12 వేల రూపాయలు చొప్పున వారికి ప్రభుత్వ సాయం అందనున్నది.

ఫ గతంలో 3.55 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం

జిల్లాలో 3.55 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్‌లో 3.55 లక్షల ఎకరాలకు తగ్గకుండా పెట్టుబడి సాయం అందింది. ఈ లెక్కన ఎకరాకు అదనంగా రెండు వేల రూపాయల చొప్పున జిల్లా రైతులకు 71 కోట్ల రూపాయల అదనపు సాయం అందనున్నది. జిల్లాలో 2023 వానాకాలం సీజన్‌లో 2,00,075 మంది రైతులు 182.3 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులని నిర్ణయించారు. ఆ సీజన్‌లో 1,88,515 మంది రైతులకు 177 కోట్ల 99 లక్షల రూపాయలు సాయంగా అందించారు. 2023 యాసంగిలో 2,03,096 మంది రైతులకు 182.01 కోట్లు ఇవ్వాలని భావించారు. అయితే 1,90,826 మంది రైతులకు 177.61 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందింది. గడిచిన సీజన్లలో రైతులకు అందిన సహాయాన్ని పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 3 లక్షల 55 వేల ఎకరాల భూమికి ప్రభుత్వం సహాయం అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే పెట్టుబడి సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు సేకరించిన భూములు, నాలా కన్వర్షన్‌ అయిన భూములు, పరిశ్రమలు, నివాస గృహాలుగా, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిన భూములు, ఫాంహౌజ్‌లుగా మారిన భూములు, గుట్టలు, కొండలు, రాళ్లు రప్పులతో సాగుకు యోగ్యంగా లేని భూములు, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములు, రోడ్లకింద పోయిన భూములకు పెట్టుబడి సాయం అందుతున్నట్లు, ఈ నిధులు దుర్వినియోగమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఇలాంటి భూములను గుర్తించి వీటికి పెట్టుబడి సాయాన్ని అందించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 యాసంగిలో 3,55,220 ఎకరాలకు, 2023-24 వానాకాలంలో 3,55,980 ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించారు.

ఫ రూ. 198 కోట్ల వరకు సాయం వచ్చే అవకాశం

ప్రస్తుతం ప్రభుత్వం సాగుకు యోగ్యంకాని భూములను మినహాయించాలని భావించిన నేపథ్యంలో ఈ విస్తీర్ణంలో 30 వేల నుంచి 35 వేల ఎకరాలు తగ్గిపోతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జిల్లాలో 3.25 లక్షల ఎకరాలకు రైతు భరోసా సహాయంగా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి 12 వేల రూపాయలు అందిస్తే జిల్లాకు 195 నుంచి 198 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందనున్నదని ప్రభుత్వ నిర్ణయంతో రైతులు సంతోషిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఎన్నికల సమయంలో, ప్రజాపాలనలో ఎకరాకు 7500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చినా అది ఆరు వేల రూపాయలకు తగ్గిపోవడం రైతుల్లో కొంత అసంతృప్తి కలిగిస్తున్నా ఈ సీజన్‌ నుంచి పెట్టుబడి సాయం అందించాలని గతం కంటే సీజన్‌కు ఎకరాకు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడంతో వారు సరిపెట్టుకుంటున్నారు.

ఫ భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేల సాయం...

భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1,23,625 జాబ్‌ కార్డులు జారీ చేశారు. వీటిలో 2,31,802 మంది కూలీలు ఉపాధి కోసం నమోదు చేసుకున్నారు. జిల్లాలో 82,460 జాబ్‌ కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో నమోదైన కూలీలు 1,26,338 మంది ఉన్నారు. ఏ మాత్రం భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సహాయం అందించినా జిల్లాలో లక్ష మందికిపైగా లబ్ధి పొందనున్నారు. యాక్టివ్‌గా ఉన్న జాబ్‌ కార్డుల్లో రెండు, మూడు వేల కుటుంబాలను మినహాయించినా మిగతా కుటుంబాల వారికి ఏమాత్రం భూమి ఉండే అవకాశం లేదు. వారందరికీ ఈ పథకం కింద ఏటా 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. 80 వేల కుటుంబాలకుపైగా ఈ పథకం కింద లబ్ధి పొందితే జిల్లాలోని వ్యవసాయ కూలీలకు 96 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉన్నది. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

Updated Date - Jan 06 , 2025 | 01:15 AM