వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:07 AM
ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.
- ఉత్తర ద్వారం గుండా స్వామి వారలను దర్శించుకున్న భక్తులు
- పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎంపీ, జిల్లా కలెక్టర్
ధర్మపురి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు వెంట రాగా మంగళ వాయిధ్యాల మధ్య అర్చకులు ఉత్తర ద్వారం తెరిచారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం గుండా లోనికి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. దారి పొడవునా బొప్పనపెల్లి ఐలయ్య బృందంచే ఒగ్గు డోలు ప్రదర్శన, మహిళల కోలాట నృత్య ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు వేర్వేరుగా పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద వారికి వేదపండితులు, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, ఎస్పీ అశోక్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పూజలు నిర్వహించారు. ఆలయం పక్షాన వారందరికి అర్చకులు ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ వారందరికీ స్వామివారి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా పోలీసు డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐలు ఉదయ్‌కుమార్; శ్రీధర్‌రెడ్డి, సతీష్, ఉమాసాగర్, శేఖర్ అనిల్ భారీసంఖ్యలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
కొండగట్టులో...
మల్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజామున వైభవంగా పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం చేశారు. దేవస్థానం తరపున పట్టువస్ర్తాలను బహుకరించగా స్వామి వార్లకు పట్టువస్త్రలంకరణ చేశారు. ప్రత్యేకించి అలంకరించిన ఆలయ ఉత్తరద్వారం వద్ద పూజలు జరిపిన అనంతరం తిరుమండపంలో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. అభిషేకం, అష్టోత్తర పూజలను ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఉత్తరద్వారం గుండా ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ముక్కోటి పూజలలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి నీరజ ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు, ఆలయ స్థానాచార్యులు, ప్రధానర్చకులు తదితరులు పాల్గొన్నారు.