హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:48 AM
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జుబ్లీహి ల్స్‌లో అరెస్టు చేశారు.
కరీంనగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి/క్రైం, జనవరి 13: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జుబ్లీహి ల్స్‌లో అరెస్టు చేశారు. కరీంనగర్ వన్‌టౌన్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమో దయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తరువాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా హుజురా బాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకుని దాడికి యత్నించి నెట్టేశాడని సంజయ్‌కుమార్ పీఏ వినోద్ అదే రోజు రాత్రి కరీంనగర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, ఆర్‌డీఓ కె మహేశ్వర్, సుడా చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ కేసులే కాకుండా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాల ని ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. రాత్రి 10.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకున్నారు. ఆయనను కరీంనగర్ సీపీటీసీ (సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్)లో ఉంచారు.
వన్‌టౌన్ ఎదుట బీఆర్‌ఎస్ ఆందోళన
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు చేసి కరీంనగర్‌కు తీసుకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉన్న వారందరూ పార్టీ కార్యాలయం వద్దకు రావాలని సందేశాలు సోషల్‌మీడియాలో పెట్టారు. కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు వన్‌టౌన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జగిత్యాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌశిక్‌రెడ్డిని ఎక్కడ ఉంచారు.. ఎప్పుడు కోర్టులో హాజరు పరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో అరాచకం నడుస్తోందని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారందరినీ పోలీ సులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయడం అమానుష చర్య అని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్ద రభస చేశారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరి శంకర్ , మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధ్వర్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
త్రీటౌన్‌కు తరలింపు
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనందున ఆయననకు అక్కడికే తీసుకొస్తారని అందరూ ఎదురు చూశారు. మీడియా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అప్పటికే పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహ రించారు. అకస్మా త్తుగా రాత్రి 11.45 గంటల సమయంలో కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, బీఆర్ ఎస్ నాయకులు అక్కడికి వెళ్లారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిని పోలీసులు ప్రాథమికంగా విచారిస్తు న్నట్టు తెలిసింది. త్రీటౌన్ లోపలికి పోలీసు అధికారులు ఒక బెడ్‌ను పంపించారు.
స్టేషన్ లోపలికి బీఆర్‌ఎస్ నాయకులు, న్యాయవాదు లైన మాజీ ఎమెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను అనుమతించారు.
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు అంబులెన్స్‌ను తెప్పిం చారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.