Share News

రెండు రోజులే మిగిలింది

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:20 AM

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే చివరి దశకు చేరుకుంది. ప్రభుత్వం పొడిగించిన గడువు మరో రెండు రోజులే మిగిలింది. ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు, వంద శాతం సర్వేను పూర్తి చేసే దిశగా ముందు కెళ్తున్నారు.

  రెండు రోజులే మిగిలింది

- చివరి దశకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే

- ఇప్పటి వరకు 95.10 శాతం పూర్తి

- యాప్‌లో వివరాల నమోదు

- జిల్లాలో 1,01,046 దరఖాస్తుల సర్వే

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే చివరి దశకు చేరుకుంది. ప్రభుత్వం పొడిగించిన గడువు మరో రెండు రోజులే మిగిలింది. ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు, వంద శాతం సర్వేను పూర్తి చేసే దిశగా ముందు కెళ్తున్నారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పర్యవేక్షణలో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, బల్దియాల్లో వార్డు అధికారులు సర్వే చేస్తున్నారు. డిసెంబరు 31 వరకు సర్వే పూర్తి చేయాల్సి ఉండగా ప్రభుత్వం మరో వారం రోజుల గడువును పొడిగించింది. జిల్లాలో సర్వే సంబంధించి ప్రధానంగా అర్హులుగా ఉన్నవారి వివరాలు సేకరించారు. ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసుకున్నవారు జిల్లా నుంచి వలసవెళ్లడం, ఇచ్చిన దరఖాస్తుల్లో ఉన్న చిరునామాలో లేకపోవడం వంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిపై కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతున్న క్రమంలో సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ మొదలువుతుందని భావిస్తున్నారు. యాప్‌ల ద్వారా నమోదు చేసిన వివరాల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించనున్నారు. గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షలు అందించనున్నారు. పునాది స్థాయిలో రూ.లక్ష, రెండో దశలో రూ.1.25 లక్షలు, మూడో దశలో స్లాబ్‌కు రూ.1.75 లక్షలు, ఫినిషింగ్‌ ఇతర దశలకు రూ.లక్ష చొప్పున అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలు, దళితులు, గిరిజనులు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వ్యవసాయ కూలీలు, ట్రాన్స్‌జెండర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

జిల్లాలో 95.10 శాతం సర్వే పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సర్వేలో 95.10 శాతం పూర్తి చేశారు. జిల్లాలోని రెండుమున్సిపాలిటీలతోపాటు మండలాల్లో 1,07,398 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,02,132 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 6976 దరఖాస్తులు రాగా 6481 దరఖాస్తులు పరిశీలించారు. చందుర్తి 9420 దరఖాస్తులకు 6093, ఇల్లంతకుంట 10216 దరఖాస్తులకు 9845, గంభీరావుపేట 8761 దరఖాస్తులకు 8096, కోనరావుపేట 8299 దరఖాస్తులకు 7938, ముస్తాబాద్‌ 9460 దరఖాస్తులకు 9190, రుద్రంగి 3780 దరఖాస్తులకు 3514, సిరిసిల్ల మున్సిపాలిటీ 12,454 దరఖాస్తులకు 11,363, తంగళ్లపల్లి 9528 దరఖాస్తులకు 8872, వీర్నపల్లి 3668 దరఖాస్తులకు 3643, వేములవాడ 4960 దరఖాస్తులకు 4585, వేములవాడ మున్సిపాలిటీ 8591 దరఖాస్తులకు 8336, వేములవాడ రూరల్‌ 4759 దరఖాస్తులకు 4678, ఎల్లారెడ్డిపేట 9526 దరఖాస్తులకు 9448 దరఖాస్తులను పరిశీలించారు. మిగతా దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయనున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 01:20 AM