పొలిటికల్ జోష్
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:15 AM
సంక్రాంతి సంబరాల్లో పొలిటికల్ జోష్ కని పించింది. గ్రామ పంచాయతీ ఎన్నిలక నోటిఫికేషన్ ఈ నెలలోనే రానున్న నేపథ్యంలో జిల్లాలోని పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. ఆశావహులు దావత్‌లు ఏర్పాటు చేశారు.
- సంక్రాంతి పూట పంచాయతీ ఎన్నికల మర్యాదలు
- ఆశావహుల ఏర్పాట్లు, పలకరింపులు
- పట్టణం వాసుల మద్దతకు బుజ్జగింపులు
- ముందస్తుగా దావత్‌లు
- జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు,
2268 వార్డులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సంక్రాంతి సంబరాల్లో పొలిటికల్ జోష్ కని పించింది. గ్రామ పంచాయతీ ఎన్నిలక నోటిఫికేషన్ ఈ నెలలోనే రానున్న నేపథ్యంలో జిల్లాలోని పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. ఆశావహులు దావత్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సంక్రాంతి సంబరాలకు పట్నం వాసులు పల్లెలకు చేరడంతో మద్దతు కోరుతూ బుజ్జగించారు. ఏడాది క్రితమే పల్లెల్లో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిపోయింది. మరోసారి పంచాయతీల్లో పోటీకి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అధికారాలు తారుమారైనా నేపథ్యంలో ప్రతిపక్షంలో చేరిన బీఆర్‌ఎస్, అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్‌లోని నాయకులు ఎన్నికలపై దృష్టి సారించారు. ఇదే సమయంలో సంక్రాంతి సంబరాలు ఉండడంతో పండగపూట ఎన్నికల వాతావరణం కనిపించింది.
పలకరింపులు.. ఆహ్వానాలు
పల్లెల్లో పండగపూట ఆశావహులు కొత్త పలకరింపులు, ఆహ్వానాలు మొదలు పెట్టారు. సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి పల్లెలకు వచ్చిన కుటుంబాలను పలకరిస్తూ తమ ఇళ్లకు ఆహ్వానం పలికారు. మళ్లీ ఓట్ల సమాయానికి రావాలని, మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఏటా సంక్రాంతి పండుగ పూట ఇంటి పక్కనే ఉన్నా పలకరించని అప్పటి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఇప్పుడు అప్యాయంగా పలకరించారు. విందులు కూడా ఏర్పాటు చేశారు. తమవైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టడంతో గ్రామాల్లో సంక్రాంతి కంటే ఎన్నికల పండుగనే కనిపించింది. ఆశావహులు తమ అనుచరులకు సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం, ఇతర ఖర్చులు కూడా సమకూర్చినట్లు తెలిసింది. జోరుగా సామూహిక దావత్‌లు ఏర్పాటు చేశారు. పల్లెల్లో ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా ఆశావహులు సంక్రాంతి పండుగతో మొదలు పెట్టిన ప్రయ త్నాలతో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పవచ్చు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
ఇప్పటికే అధికారులు జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, 2268 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహ ణకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశారు. మరోవైపు పోటీ చేసేవారిలో సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను సైతం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జిల్లాలోని పల్లె ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. 12 మండలాల్లో 3,46,259 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,67,686 మంది మహిళలు 1,78,553 మంది జెండర్‌లు 20 మంది ఉన్నట్లు జాబితాను వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల వాతావరణం ఏర్పడగా రిజర్వేషన్లపై ఆసక్తి పెరిగింది. రిజర్వేషన్లలో మార్పులు వచ్చినా పోటీకి తమ అనుచరులనైనా రంగంలోకి నిలపాలని భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు ఉంటే ఆశావహులు తమ సతీమణి, కూతురు, కోడళ్లను బరిలో నిలపాలనే నిశ్చయంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.