Share News

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:18 AM

పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది.

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

- పేరుకుపోతున్న చెత్తాచెదారం

- పంచాయతీల్లో అడుగడుగునా సమస్యలు

- పట్టించుకునే వారు కరువు

- ప్రత్యేకాధికారుల పాలనలో ఇబ్బందులు

పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది. గ్రామాల్లో ఏమైనా సమస్యలున్నా చెప్పుదామంటే అధికారులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి పరిశీలన’..

హుజూరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ మండలంలో ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసిన చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారు. గ్రామాల్లో వీధి దీపాలు చాలా రోజుల నుంచి వెలగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైంది.

శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటు పడింది. పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీరు, వీధి దీపాలు తదితర సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చెప్పడం లేదు.

ఫ నిధులు లేక ఇబ్బందులు

సైదాపూర్‌: మండలంలో 26 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా మూడు గ్రామ పంచయతీలు మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీల నెలనెల రావల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ కకపోవడంతో గ్రామ పంచాయతీల నిర్వాహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. సిబ్బంది జీతాలు రెండు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.

ఫ పర్యవేక్షణ కరువు

రామడుగు: మండలంలోని పారిశుధ్యం అధ్వానంగా మారింది. రామడుగు, అన్ని గ్రామాల్లో పారిశుఽధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారితో పని చేయించేవారు లేరు. సర్పంచులు లేక, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు అంటున్నారు. అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో నెలల తరబడి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ గ్రామంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది.

ఫ రోడ్లపైనే మురుగునీరు

వీణవంక: మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. రోడ్లపై మురుగు నీరు నిలిచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పలుచోట్ల రోడ్లు దెబ్బతిని అధ్వానంగా మారాయి. గ్రామాల్లోని సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు అందడం లేదు.

ఫ 27 పంచాయతీలకు 12 మంది ప్రత్యేకాధికారులు

మానకొండూర్‌: మండలంలో 27 గ్రామపంచాయితీలకు 12 మందిని వివిద శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. రంగపేట, వెల్లి, చెంజర్ల గ్రామాలకు పంచాయితీ కార్యదర్శులు లేరు. ఒక్కొక్కరికి రెండు మూడు గ్రామాలను కేటాయించారు. దీంతో ప్రత్యేకాధికారులు గ్రామాలకు రెండు, మూడు రోజులకొకసారి వెళ్లడంతో పర్యవేక్షణ కరువైంది. గ్రామపంచాయితీ సిబ్బంది మురికి కాల్వల నుంచి తీసిన మట్టి, చెత్తాచెదారం ట్రాక్టర్ల ద్వారా తొలగించడం లేదు. మానకొండూర్‌లోని రాజీవ్‌నగర్‌ కాలనీలో వీధి దీపాలు లేక ఇబ్బందిపడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ పంచాయతీ కార్యదర్శులపైనే భారం

తిమ్మాపూర్‌: మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పజెప్పడంతో ప్రత్యేక అధికారులపై పని భారం ఎక్కువైంది. పంచాయితీ కార్యదర్శులే గ్రామల్లో అత్యవసర సేవలకు ఖర్చు పెడుతున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన బిల్లులు పేరుకుపోయాయి. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల వాయిదాలు చెల్లించలేని పరిస్ధితులు ఉన్నాయి. కేంద్ర నిధులు కూడా నిలిచిపోవడంతో ఇబ్బందిపడుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ వెలగని వీధి దీపాలు

గన్నేరువరం: మండల కేంద్రంలోని పలు వీధుల్లో దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టిచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగపల్లిలో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయింది. రోడ్లపై చెత్త పేరుకుపోయింది. గునుకుల కొండాపూర్‌లో ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు ఇళ్ల చుట్టూ చేరి దుర్వాసన వెదజల్లుతోంది.

ఫ అందుబాటులో ఉండని ప్రత్యేకాధికారులు

చిగురుమామిడి: మండల ప్రత్యేక అధికారితోపాటు, గ్రామాల ప్రత్యేకాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని, ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ మంచినీటి పైపు లైన్లకు మరమ్మతులు కరువు

గంగాధర: గంగాధర మండలంలో 33 గ్రామ పంచాయతీలుండగా రెండు నుంచి మూడు గ్రామాలకు ఒక్క ప్రత్యేకాధికారిని నియమించారు. ప్రత్యేకాధికారులు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చి పోతుండగా పారిశుధ్యం, వీధి ధీపాలు, మంచినీటి సరఫరా పైపులైన్ల మరమ్మతులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా ట్రాక్టర్‌ కిస్తీలు, ట్రాక్టర్లకు డీజిల్‌కు, విద్యుత్‌ బిల్లుల భారం కార్యదర్శులపైనే పడుతోంది. ప్రత్యేకాధికారులు అంటిముట్టనట్టు ఉంటున్నారు.

ఫ అధ్వానంగా డంపింగ్‌ యార్డులు

భగత్‌నగర్‌: కొత్తపల్లి మండల వ్యాప్తంగా గ్రామాల్లో ప్రత్యేక పాలనలో పారిశుధ్యం పడకేసింది. కొత్తపల్లి మండలం వ్యాప్తంగా ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో చింతకుంట, ఎలగందల్‌, బావుపేట(ఆసిఫ్‌నగర్‌), ఖాజీపూర్‌, నాగులమల్యాల, కమాన్‌పూర్‌, బద్దిపల్లి, మల్కాపూర్‌ గ్రామాలు ఉన్నాయి. గ్రామపంచాయతీల పదవీ కాలం ముగిసిన తర్వాత అన్ని గ్రామాలకు అధికారులు ప్రత్యేకాధికారులను నియమించారు. రోజు వారీగా చెత్తను తొలగించక పోవడంతో రోడ్లపైనే చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు అందుతున్నా రోజు వారీ నిత్యావసరాల కోసం గ్రామాల్లోని బోరు బావులపై ప్రజలు ఆధారపడుతున్నారు. వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతున్నాయో, ఎప్పుడు ఆరిపోతున్నాయో తెలియని పరిస్థితి ఉన్నది. సర్పంచులు ఉంటే తాము వారికి సమస్యలు తెలిపిన వెంటనే పరిష్కరించేవారని, ఇప్పుడు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:19 AM