Share News

సంక్రాంతికి అందని రేషన్‌ బియ్యం

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:34 AM

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ.. పది రోజుల ముందే ప్రతి ఇంట్లో చకినాలు, అరిసెలు, గారెలు చేసుకొని తింటూ కుటుంబ సభ్యులంతా ఆనందోత్సహాల మధ్య పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.

సంక్రాంతికి అందని రేషన్‌ బియ్యం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ.. పది రోజుల ముందే ప్రతి ఇంట్లో చకినాలు, అరిసెలు, గారెలు చేసుకొని తింటూ కుటుంబ సభ్యులంతా ఆనందోత్సహాల మధ్య పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పిండి వంటలు చేసుకోవడానికి బియ్యం పిండే ప్రధాన వనరు. ఇప్పుడు ఆ బియ్యం అందక గ్రామీణ ప్రాంతాల్లో సగం మంది పిండి వంటలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జనవరి మాసంలో రేషన్‌ బియ్యం అందలేదు. పౌరసరఫరాలశాఖలో పనిచేసే హమాలీలు జనవరి 1 నుంచి సమ్మెకు దిగడంతో బియ్యం బస్తాలు ఎత్తేవారు, దించేవారు లేక ప్రజాపంపిణీ వ్యవస్థ డీలర్లకు రవాణా నిలిచి పోయింది. పైసా అవసరం లేకుండా బియ్యం లభ్యమయ్యే పరిస్థితి నుంచి కిలోకు 50 రూపాయల వరకు వెచ్చించి బియ్యం కొనుక్కొని పిండివంటలు చేసుకోవలసిన పరిస్థితి రావడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఫ జిల్లాలో 2,61,164 ఆహారభద్రత కార్డులు

జిల్లాలో ఆహారభద్రత కార్డులు పొందిన కుటుంబాలు 2,61,164 ఉండగా ఈ కార్డుల్లో 7,64,122 మంది సభ్యులుగా నమోదయ్యారు. వీరందరికి ఒక్కొక్క సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెలా 45,847 క్వింటాళ్ల బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ ఆహారభద్రతా కార్డుల ద్వారా 41,034 మందికి ఒక్కో కుటుంబానికి 35 కిలోల చొప్పున 5,505.50 క్వింటాళ్లు, అన్నపూర్ణ కార్డుల ద్వారా 35 కుటుంబాలకు కుటుంబానికి 10 కిలోల చొప్పున 3.5 క్వింటాళ్లు బియ్యం సరఫరా అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 566 రేషన్‌ షాపుల ద్వారా ఈ మూడు పథకాల కింద 51,356 క్వింటాళ్ల బియ్యం నెలనెలా సరఫరా చేస్తున్నారు.

ఫ సమస్యలు పరిష్కరించాలని హమాలీల సమ్మె

రేషన్‌షాపుల డీలర్లు ముందస్తుగా డీడీల ద్వారా డబ్బు చెల్లిస్తే సివిల్‌ సప్లయిస్‌ శాఖ వారికి బియ్యం సరఫరా చేస్తుంది. జనవరి మాసానికి సగం మంది డీలర్లకు మాత్రమే బియ్యం సరఫరా అయింది. హమాలీలు జనవరి 1 నుంచి సమ్మెకు దిగగా సరఫరా నిలిచిపోయింది. దీంతో పండుగకు బియ్యం పంపిణీ జరగలేదు. పౌరసరఫరాలశాఖకు అనుబంధంగా జిల్లాలో సుమారు 300 మంది హమాలీలు, కూలీలు పని చేస్తున్నారు. వీరి ద్వారానే బియ్యం రవాణా జరుగుతున్నది. బియ్యం బస్తాలను ఎత్తిదించే చార్జీలుగా క్వింటాల్‌కు 26 రూపాయలు పొందేవారు. ఆ డబ్బు సరిపోవడం లేదని వారు చేసిన ఆందోళన కారణంగా పౌరసరఫరాలశాఖ అదనంగా మరో మూడు రూపాయలు పెంచడానికి అంగీకరించింది. వారికి ప్రభుత్వం సమకూర్చే దుస్తుల టైలరింగ్‌ చార్జీలను 1200 నుంచి 1500 రూపాయలకు, దీపావళి పండుగకు స్వీట్లకుగాను ఇచ్చే 1500 రూపాయలను 1800 రూపాయలకు, బోనస్‌ను 1800 నుంచి 2000 రూపాయలకు పెంచేందుకు అక్టోబరు 4న ఒప్పందం కుదిరిదింది. ఈ ఒప్పందంపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సంతకం చేశారు. ఒప్పందం కుదిరిన 10 రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలు అయినా జీవో రాక పోవడంతో హమాలీలు మళ్లీ ఆందోళన బాటపట్టారు. డిసెంబరు 18న నోటీసు ఇచ్చినా పౌరసరఫరాలశాఖ నుంచి స్పందన రాక పోవడంతో జనవరి 1 నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. హమాలీలు డిసెంబర్‌ 18నే సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు ముందస్తుగా డీలర్లనుంచి డీడీలు తెప్పించుకోకపోవడంతోనే పండుగ పూట ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ పోలీసు పహారాలో బియ్యం సరఫరా

సుభాష్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): సివిల్‌ సప్లయిస్‌ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న హమాలీలు సమ్మె చేస్తుండడంతో సంక్రాంతి పండగ వస్తున్నందున ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంఎల్‌సీ పాయింట్‌ నుంచి పోలీసు పహారా మధ్యఒడిశాకు చెందిన కూలీలతో బియ్యం బస్తాలను లోడింగ్‌ చేయించారు. సోమవారమే కూలీలను తీసుకువచ్చి లోడింగ్‌ చేయించాలని అధికారులు ప్రయత్నించారు. హమాలీలు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు. మంగళవారం పోలీసు పహారా మధ్య బియ్యం బస్తాలను లోడ్‌ చేయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు కొయ్యడ సృజన్‌ మాట్లాడుతూ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందానికి సంబందించిన జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 08 , 2025 | 01:34 AM