అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా..
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:24 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచి పోయింది. ఈ ఏడాది కాలంలో జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ రెట్టింపు ఉత్సాహంతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచి పోయింది. ఈ ఏడాది కాలంలో జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ రెట్టింపు ఉత్సాహంతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎన్నో పనులను మంజూరు చేశారు. వాటిలో కొన్ని పనులు ఆరంభం కాగా, మరికొన్ని పనులు డీపీఆర్, టెండర్ల దశలో ఉన్నాయి. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. కొత్త ఏడాది కొత్త ఆలోచనలతో వివిధ వర్గాల ప్రజలు ముందుకు పోతున్న తరుణంలో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు అదే బాటలో పయనిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని పలకరించగా కొత్త సంవత్సరంలో చేపట్టబోయే తమ ఆలోచనలను ఆవిష్కృతం చేశారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళతామని వెల్లడించారు.
బస్ డిపో, బైపాస్ రోడ్డు తదితర పనులు పూర్తి..
- చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): గడచిన ఏడాది కాలంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపో మంజూరు చేయించాం. వారం, పది రోజుల్లో స్థలాన్ని ఆర్టీసీకి అందజేయనున్నారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు రూ. 80 కోట్లు, మానేరుపై రూపునారాయణ పేట వద్ద వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు, రాఘవాపూర్‌లో కోర్టు భవన నిర్మాణం, ఇందిరమ్మ మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.5కోట్లు, జిల్లా గ్రంథాలయ భవనానికి 5 కోట్లు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో పలు రహదారులు, హుస్సేన్‌మియా వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో కొన్ని పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. ఈ పనులను కొత్త ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించాం. అలాగే పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల వాంఛ అయిన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమవుతున్నది. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని భావిస్తున్నాం.
మరో 3600మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
రూ.280కోట్లతో కార్పొరేషన్ ప్రాంత అభివృద్ధి
నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు, ఫోర్‌వేలు నిర్మిస్తాం...
గోదావరినదికి కరకట్ట తెస్తాం...
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్
గోదావరిఖని (ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తా.. 2025లో రామగుండంలో 1/800జెన్‌కో విద్యుత్ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శంకుస్థాపన చేయిస్తా. ప్రజాభిప్రాయ సేకరణను తొందరగా నిర్వహించి రామగుండం ఎన్‌టీపీసీలో 800మెగావాట్ల మూడు విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణాన్ని చేపడుతాం. 3600మెగావాట్ల విద్యుత్ అదనపు ఉత్పత్తికి 2025లో శంకుస్థాపనలు జరిపిస్తా. పాలకుర్తి మండలం బండలవాగు ప్రాజెక్టును ప్రారంభిస్తా. 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.350కోట్లతో ప్రతిపాదనలు చేశాం. రూ.280కోట్లతో రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని కేంద్రంగా రోడ్లు, డ్రైనేజీలు, ఎస్‌టీపీలు ఒకే సంవత్సరంలో నిర్మాణం చేస్తాం. సింగరేణి ద్వారా ఎస్‌టీపీల నిర్మాణంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లను కూడా గోదావరిఖనిలో నిర్మిస్తాం. సెంటినరీకాలనీ జేఎన్‌టీయూ కళాశాల నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడుతాం. రూ.60కోట్లతో ఆర్‌అండ్‌బీ ద్వారా ధర్మారం ఎక్స్‌రోడ్డు నుంచి గోలివాడ వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మిస్తాం. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ రోడ్డుకు అనుసంధానంగా అంతర్గాం నుంచి సరాసరి రైట్ ఆర్మ్ వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతాం. అంతర్గాం నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌కు మధ్యలో రూ.150కోట్లతో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మిస్తాం. రామగుండం ఈఎస్‌ఐ ఆసుపత్రికి పక్కా భవనాన్ని ఏర్పాటు చేస్తాం. రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లను గోదావరి బ్రిడ్జి వరకు, నర్సింగ్ కాలేజీకి భవన నిర్మాణం చేపడుతామన్నారు. సిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. గోదావరి పరివాహక ప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు మేడిపల్లి ఓపెన్‌కాస్టు నుంచి సుందిళ్ల వరకు కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. ప్రజల అవసరాలను బట్టి, ప్రాంత అభివృద్ధి డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.