ఆశలు ఫలించే వేళాయె...
ABN , Publish Date - Jan 13 , 2025 | 01:39 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరో నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ, గూడులేని పేదల కలలు సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇళ్లు, అన్నదాతల ఆశలకు తగ్గట్టుగా రైతు భరోసా, కూలీల ఆత్మీయ భరోసా వంటివి అమలు చేయడానికి రంగం సిద్ధమైంది.
- నాలుగు సంక్షేమ పథకాలకు 26న ముహూర్తం
- ఈనెల 16వ తేదీ నుంచి కసరత్తు
- జాబితాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయభరోసా, రేషన్ కార్డులు
- ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులకు సర్కారు దిశానిర్దేశం
జగిత్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరో నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ, గూడులేని పేదల కలలు సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇళ్లు, అన్నదాతల ఆశలకు తగ్గట్టుగా రైతు భరోసా, కూలీల ఆత్మీయ భరోసా వంటివి అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఈనెల 16వ తేదీ నుంచి తుది దశ కసరత్తు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయా సందర్భాల్లో పథకాల అమలు, విధి విధానాలపై కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి దిశానిర్ధేశం చేశారు. పథకాల అమలుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఈనెల 26వ తేదీన గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి పథకాలను ప్రజల చెంతకు చేర్చడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
సాగుభూములకే రైతు భరోసా...
జిల్లా రైతులు భరోసాపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీ నుంచి అర్హులైన రైతులకు ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ. 12 వేల చొప్పున నగదు జమ చేసే ప్రక్రియ మొదలుకానుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరువేల రూపాయల చొప్పున నగదు అందనుంది. జిల్లాలో వానాకాలం పంటల సాగు 5.20 లక్షల ఎకరాలు సాగుకాగా ప్రస్తుత యాసంగి పంటల సాగు అంచనా ప్రకారం 4.50 లక్షల ఎకరాలుగా ఉంది. జిల్లాలో 2024-24 యాసంగిలో 2,39,818 మంది రైతులకు 214.32 కోట్ల రూపాయల రైతు భరోసా అందింది. ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల మేరకు ఎందరికి భరోసా దక్కుతుందో ఈనెల 26వ తేదీన తేలనుంది. ఆ రోజునే గ్రామ సభల ద్వారా అర్హులను ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొండలు, గుట్టలు, వాగులు, చెరువులతో పాటు ఇళ్ల నిర్మాణం, పరిశ్రమ ఏర్పాటుకు బదిలీచేసిన భూములకు సైతం రైతు బంధు అందేది. అయితే ఇప్పుడు మాత్రం సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఇళ్లలో పేదలకు ప్రాధాన్యం..
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ పథకం కూడా ఈనెల 26వ తేదీ నుంచి అమలు కానుంది. ప్రజాపాలన సభల్లో జిల్లాలో 2,02,011 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటి ఆధారంగా అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే చివరి దశలకు చేరుకుంది. ఆపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మరోమారు తనిఖీ చేస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లో చేపడతారు. తొలి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయిస్తామని ప్రభ్వుత్వం ప్రకటించింది. ఎస్సీ నియోజకవర్గంలో అదనంగా ఇళ్లు కేటాయించాలని నిర్ణయిం చింది. ప్రతీ ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో నగదు అందజేస్తారు. మరోపక్క మండల కేంద్రాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణం కూడా జరుగుతోంది. తద్వారా ఐదు లక్షల రూపాయల నగదుతోనే ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.
భూమిలేని పేదలకు..
భూమిలేని నిరుపేదల ప్రతి సంవత్సరం రూ. 12 వేల చొప్పున రెండు విడతలుగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో అమలు అయ్యే ఈ పథకానికి కూడా ఈనెల 26వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించారు. భూమిలేని నిరుపేదల కుటుంబాన్ని యూనిట్‌గా ఎంపిక చేస్తారు. కుటుంబం లో ఎవరైనా ఒకరు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పథకం కింద పనిచేసి ఉండాలి. కాగా జిల్లా లో 1.67 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 2.73 లక్షల మంది కూలీ లు ఉన్నారు. ఇందులో ఎందరు అర్హత సాధిస్తారో త్వరలోనే వెల్లడి కానుంది.
రేషన్ కార్డుల జారీకి కసరత్తు...
జిల్లాలో అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 3,10,545 రేషన్ కార్డులుండగా ఇందులో 2,95,916 ఆహార భద్రతా కార్డులు, 14,483 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెల సు మారు 9,369 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సుమారు 9,04,521 మందికి పౌరసరాఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డుల కోసం గతంలో ప్రభుత్వానికి సుమారు 45 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో నుంచి అర్హుల గుర్తింపునకు కసర త్తులు జరుగుతున్నాయి. తెల్లరేషన్ కార్డులు పొందడానికి అర్హులై న కుటుంబాలను సైతం గుర్తించి ఈనెల 26వ తేదీన గ్రామసభ లు, వార్డుసభల ద్వారా జాబితాలను ప్రకటించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కసరత్తు తుదిదశకు చేరింది. ఈ పథకాల అమలుపై పలు సందర్భాల్లో ఆయా శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌తో పాటు ఆయా ప్రభు త్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వీడియో కాన్ఫ రెన్స్‌లు నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇటీవల హైద్రాబాద్‌లో కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈనెల 16వ తేదీ నుంచి అధికారులు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ప్రారంభించి 26వ తేదీన జాబితాలు వెల్లడించే అవకాశం ఉంది.