కోటి ఆశలతో.. కొత్త సంవత్సరంలోకి
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:28 AM
జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. గడిచిన జ్ఞాపకాలతో 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త లక్ష్యాలతో 2025కు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మండల, గ్రామాల్లో పండగవాతావరణం కనిపించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. గడిచిన జ్ఞాపకాలతో 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త లక్ష్యాలతో 2025కు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మండల, గ్రామాల్లో పండగవాతావరణం కనిపించింది. యువత రోడ్లపైకి వచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేక్‌లు కోసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా కూల్‌డ్రింక్, కేక్‌లు కొనుగోళ్లతో బేకరీలు కిటకిటలాడాయి. మద్యం దుకాణాలకు ఆర్ధరాత్రి వరకు తెరచుకునే అవకాశం కల్పించడంతో కళకళలాడాయి. నూతన సంవత్సరం సందర్భంగా మటన్, చికెన్ కొనుగోళ్లు పెరిగాయి. చికెన్, మటన్ ధరలను పెంచి అమ్మకాలు జరిపారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. యువత డీజె సౌండ్ల మధ్య కాలనీల్లో ప్రత్యేక ఏర్పాటు చేసుకోని సందడిగా గడిపారు. సిరిసిల్ల, వేములవాడ, పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వయోభేదం లేకుండా నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.
హోం సెలబ్రేషన్స్
కేరింతలు.. సంబరాలు. అంబరాన్ని అంటాయి. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిన 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో గడుపుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ నిఘా ఉండడంతో యువత ఈ సారి కూడాకాలనీలకే పరిమితమైంది. కొన్ని కుటుంబాలు కలిసి వేడుకలకు జరుపుకున్నారు. పోలీసుల ఆంక్షలను దృష్టిలో పెట్టుకున్న యువకులు ఫ్యామిలీలతో వేడుకలు జరుపుకున్నారు.
మద్యంషాపులు బిజీ బిజీ
కొత్త సంవత్సరం వేళ మద్యం షాపులు బిజీబిజీగా మారాయి. మద్యం ప్రియులను దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్ శాఖ ఈ సంవత్సరం కూడా మద్యం దుకాణాలను ఆర్ధరాత్రి దాటే వరకు అవకాశం కల్పించింది. వైన్స్‌షాపులు ఆర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచారు. కొంత కాలంగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాదాపు రూ.4 కోట్ల వరకు మద్యం వ్యాపారం సాగినట్లు తెలిసింది.
బిర్యానీ పాయింట్లలో ప్రత్యేక ఆఫర్లు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకున్న సంబరాల్లో బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పట్టణం, మండల కేంద్రాలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో చికెన్, మటన్ కాకుండా ఫ్రాన్స్, ఫిష్ బిర్యానీలకు గిరాకీ కనిపించింది.
బేకరీల్లో సందడి
కొత్త వేడుకకు సిరిసిల్ల, వేములవాడలో బేకరీల్లో కేక్‌ల కొనుగోలుతో సందడి కనిపించింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆర్ధరాత్రి చిన్నపిల్లలతోపాటు పెద్దవాళ్ల వరకు కేక్‌లు కట్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలకే దాదాపు రూ.25 లక్షల వరకు కేక్‌ల బిజినెస్ సాగింది.. రకరకాల డిజైన్లలోని కేక్‌లు ఆకట్టుకున్నాయి. పలు బేకరీలు ప్రత్యేక ఆకర్షణలతో ఆఫర్లను ప్రకటంచాయి. కిలో రూ.100 నుంచి రూ.500 వరకు పలు రకాల కేక్‌లను డిస్కౌంట్లలో అందించారు. కొన్ని చోట్ల కేక్‌తోపాటు ఉచితంగా కూల్‌డ్రింక్స్ అందించారు. రెస్టారెంట్లలో చికెన్ ఆర్డర్లకు తందూరీ రోటీ ఉచితంగా అందించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్‌ల పెట్రోలింగ్
నూతన సంవత్సర వేడుకల్లో యువత జోష్ ఎక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు బుధవారం తెల్లవారు జాము వరకు పెట్రోలింగ్ నిర్వహించారు డ్రంకెన్‌డ్రైవ్, ట్రిఫుల్ రైడింగ్ చేసిన వారిని ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.