Kavitha: బీసీలకిచ్చిన హామీల అమలేది సీఎం?
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:34 AM
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు బీసీ మహాసభ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ వర్గాలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న బీసీ మహాసభ పోస్టర్‌ను బుధవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బీసీలకిచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపుపై కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. హామీల అమలుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. బీసీ కుల సంఘాలతోపాటు విద్యార్థి, ఇతర సంఘాల మద్దతుతో సావిత్రీబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఈ నెల 3న మహాసభ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సభకు భారీఎత్తున హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.