హిందీ నేర్చుకోవాలని ఎవరినీ బలవంతపెట్టలేదు!
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:01 AM
తెలంగాణ, తమిళనాడుల్లో ఏ ఒక్క వ్యక్తినీ హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టలేదని.. తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే భాష పేరుతో, డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల్లో లబ్ధికి భాష, డీ లిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం
జనగణనే జరగలేదు.. సీట్లు ఎలా తగ్గుతాయి?: కిషన్‌రెడ్డి
బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన
డీఎంకేపై తమిళుల్లో అసంతృప్తి.. అందుకే డ్రామాలు: బండి
హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలి: లక్ష్మణ్
హైదరాబాద్, కరీంనగర్, బేగంపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, తమిళనాడుల్లో ఏ ఒక్క వ్యక్తినీ హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టలేదని.. తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే భాష పేరుతో, డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను శనివారం కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో అన్ని ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎంగా స్టాలిన్ ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలని నిలదీఽశారు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే... భాష పేరుతో, డీలిమిటేషన్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమిళనాడులో త్రిభాష విధానం కొత్తది కాదని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధానం ఉందన్నారు. నూతన విద్యావిధానం వచ్చాక మాతృభాషలోనే ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. ‘ఇంత వరకు జనాభా గణనే పూర్తికాలేదు. డీలిమిటేషన్ ప్రకారం సీట్లు తగ్గుతాయని ఎలా చెప్పగలరు? దక్షిణ భారతదేశంలో గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే ప్రజలు ఊరుకోరు. చైతన్యవంతమయ్యారు. తమిళభాషలో తీసిన సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
విమానాశ్రయాల్లా రైల్వే స్టేషన్లు
కేంద్రం అధునికీకరించబోయే రైల్వే స్టేషన్లన్నీ ఎయిర్‌పోర్టుల్లా అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. బేగంపేట రైల్వేస్టేషన్‌ను మహిళా లోకానికి అంకితమివ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారని, ఈ రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డుల నుంచి అధికారుల వరకు అందరూ మహిళా ఉద్యోగులే ఉంటారని తెలిపారు. రూ.26 కోట్లతో తొలివిడత చేపట్టిన పనులు 90 శాతం పూర్తయ్యాయని, రూ.12 కోట్లతో రెండో విడత పనులను చేపడతామన్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం రూ.5,337 కోట్లతో ఆధునికీకరణ, రూ.39,300 కోట్లతో రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తొలివిడత ఆధునికీకరణ పనులు రూ.715 కోట్లతో వచ్చే ఏడాదికి పూర్తవుతాయన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ పనులు రూ.327 కోట్లతో ప్రారంభమయ్యాయని తెలిపారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డుపై నిర్ణయం తీసుకుంటే పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. నగరంపై భారం పడకుండా చర్లపల్లి నుంచి రైళ్లను పడపాలనే ప్రణాళికలు ఉన్నాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి భేటీ
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై గట్టిగా నిలదీయాలని చెప్పారు. శనివారం రాత్రి దిల్‌కుషా గెస్ట్‌హౌ్‌సలో బీజేపీ ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎవరెవరు ఏయే విషయంపై మాట్లాడాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రజల్లో అసంతృప్తి.. అందుకే డ్రామాలు
తమిళనాడులో డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అందుకే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేయనుందని డ్రామాలు మొదలుపెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాటాడారు. సమస్యలతో సతమతమవుతున్న తమిళులు డీఎంకే ప్రభుత్వంపై కసితో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పేరిట, తబ్లిగీ జమాతే సంస్థ సమావేశాల పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నారని, వీటి వల్ల హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు. జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయని పేర్కొన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలను తాను వినలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఆ భూములు వృక్ష, పక్షి సంపదకు నిలయం
హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ తరపున ఉద్యమిస్తామన్నారు. క్యాంప్‌సలో ఉన్న 400 ఎకరాల భూమి అరుదైన వృక్ష, పక్షి సంపదకు నిలయంగా ఉందని చెప్పారు.