Share News

Rural Roads: రోడ్లు లేవని పిల్లనిస్తలేరు!

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:32 AM

సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు హరీశ్‌రావు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కూడా పాలుపంచుకున్నారు.

Rural Roads: రోడ్లు లేవని పిల్లనిస్తలేరు!

  • వికారాబాద్‌ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు

  • స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు

  • వాళ్ల హయాంలో మామ, అల్లుడు, బామ్మర్దే రోడ్లు వేసుకున్నరు

  • కమీషన్లు రావనే అన్నిచోట్ల వేయలేదు

  • మంత్రి కోమటిరెడ్డి విమర్శ

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు హరీశ్‌రావు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కూడా పాలుపంచుకున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్‌పై చర్చలో భాగంగా గ్రామీణ రోడ్లపై చర్చలో మంత్రి కోమటిరెడ్ది మాట్లాడుతూ.. మామ గజ్వేల్‌లో, అల్లుడు సిద్దిపేటలో, బామ్మర్ది సిరిసిల్లలో మాత్రమే రోడ్లు వేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ పక్కనే ఉన్న దుబ్బాకలో కూడా రోడ్లు సరిగ్గా లేవన్నారు. సింగరేణికి చెందిన డిస్ట్రిక్ట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ డబ్బులతో గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ రోడ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రోడ్లు వేస్తే కమీషన్లు రావనే వాటిని పక్కనపెట్టారని ఆరోపించారు.


ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కల్పించుకుంటూ.. వికారాబాద్‌ జిల్లాలో గ్రామాలకు రోడ్లు సరిగాలేక.. అబ్బాయిలకు పిల్లనివ్వడంలేదని అన్నారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో రోడ్లు లేకనే అబ్బాయిలకు పిల్లనివ్వలేదన్నారు. తమ ప్రభుత్వం హయాంలో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు వేశామని తెలిపారు. కాగా, 10 ఏళ్లపాటు రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తాము ఏటా 4 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికే హ్యామ్‌ విధానం తెచ్చామని అన్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్న చరిత్ర బీఆర్‌ఎ్‌సదని మండిపడ్డారు. హరీశ్‌రావుకు ఏమీ తెలియదని, కొందరు ఆయనను ముందుపెట్టి మాట్లాడిస్తున్నారని అన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 03:32 AM