Medical College: ఆసిఫాబాద్‌లో వైద్య విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:56 AM
తమ కాలేజీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అంకుశాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కళాశాలలో కనీస మౌలిక వసతులు లేవని నిరసన
ఆసిఫాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తమ కాలేజీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అంకుశాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య విద్యార్థులు మాట్లాడుతూ, కళాశాలలో తగినంత మంది ప్రొఫెసర్లు లేక తరగతులు పూర్తిస్థాయిలో కొనసాగడంలేదని తెలిపారు.
వైద్య పరిశోధనల కోసం ఎనిమిది మృతదేహాలు ఉండాల్సి ఉండగా ఒక్కటి కూడా లేదని, ల్యాబుల్లో రసాయనాలు లేవని చెప్పారు. వసతిగృహాల్లో బాత్రూంలు కంపుకొడుతున్నాయని, గదుల్లో పై పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో తెలియక భయం భయంగా గడపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థులు కలెక్టర్‌కు అందజేశారు.