Share News

CM Revanth Reddy: నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

ABN , Publish Date - Jan 26 , 2025 | 08:18 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సీఎం ప్రారంభిస్తారు.

CM Revanth Reddy: నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం నారాయణపేట జిల్లా (Narayanapet Dist.)లో పర్యటించనున్నారు. కోస్గి మండలం, చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను (Four Schemes) ఆయన ప్రారంభించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సీఎం ప్రారంభిస్తారు. ఈరోజు మధ్యాహ్నం చంద్రవంచకు ఆయన రానున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కోస్గి మండలం, చంద్రవంచ గ్రామానికి చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాల అధికారుల పర్యవేక్షణలో హెలిపాడ్ , సభ నిర్వహణ ఏర్పాట్లు సిద్ధం చేశారు.


సీఎం పర్యటన షెడ్యూల్..

సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. 12:50 గంటలకు కోస్గి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రవంచ గ్రామానికి చేరుకొని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. ప్రజాపాలన, సమగ్ర సర్వే సందర్భంగా వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి.. జాబితాలను సిద్ధం చేశారు. అనర్హుల ఏరివేత, జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా రైతు భరోసా కోసం ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ దరఖాస్తులను ఫైనల్‌ చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మొదటి విడత కింద కేటాయించగా.. 12 నియోజకవర్గాలకు కలిపి 42 వేల ఇళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం 59 వేల పైచిలుకు దరఖాస్తులు రావడం గమనార్హం. విస్తీర్ణం, నియోజకవర్గాల వారీగా పెద్దగా ఉన్న జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇన్ని దరఖాస్తులు రాలేదు. రేషన్‌ కార్డుల కోసం కూడా అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అంతమందికి కార్డులు ఇవ్వడం సాధ్యమేనా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు లక్షల్లో రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా గత ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపేయడంతో ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టమవుతోంది.


రెండింటికే అత్యధికంగా దరఖాస్తులు

గ్రామ సభల్లో అప్పటికే వచ్చిన జాబితాతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో.. ప్రధానంగా రెండు పథకాలకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులకు భారీ సంఖ్యలో దరఖాస్తుఉ వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధికంగా 13,0541 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 42 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్‌ కార్డుల కోసం 1,25,110, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం 27,116 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకం కోసం వనపర్తి జిల్లాలోనే అత్యధిక మంది అర్జీలు పెట్టుకున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లు నిధులు విడుదల చేసి.. సంవత్సరానికి 3,500 చొప్పున నియోజకవర్గాల్లో ఇళ్లు మంజూరు చేస్తే వచ్చే మూడేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు అందరికీ పక్కా గృహాలు అందుతాయనే భావన ప్రజల్లో ఉంది. ఇప్పటికే ఏడాది ఆలస్యం కాగా.. వచ్చే బడ్జెట్‌ నుంచి 2027 బడ్జెట్‌ వరకు ఈ పథకం కోసం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దాదాపు ఉమ్మడి జిల్లా పరిధిలోనే రూ. 6,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇక రైతు భరోసా ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఉండగా.. కొత్తగా 6,320 మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని జిల్లాల కంటే భిన్నంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రేషన్‌ కార్డులు మినహా మిగతా మూడు పథకాలకు చాలా తక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి.


33,183 ఎకరాల గుర్తింపు

గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన భూములకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి, యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భువన్‌ యాప్‌ సాయంతో సర్వే నిర్వహించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 33,183 ఎకరాలు సాగుకు యోగ్యం కాదని గుర్తించారు. కొత్తగా ప్రారంభించనున్న రైతు భరోసా పథకం నుంచి వాటిని తొలగించి.. సాగుకు యోగ్యమైన భూములు ఉన్న రైతులకు మాత్రమే ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూములను అత్యధికంగా గుర్తించగా.. వనపర్తి జిల్లాలో అత్యల్పంగా గుర్తించారు. ప్రధానంగా వెంచర్లు, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములు, కొండలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే సాగులో భూమి ఉన్నా లేకున్నా.. సాగుకు యోగ్యంగా ఉంటే మాత్రం వాటిని రైతుభరోసా కింద అర్హత ఉన్నట్లు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం

తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 08:28 AM