Share News

సందడే..సందడి

ABN , Publish Date - Jan 01 , 2025 | 10:55 PM

న్యూ ఇయర్‌ వేడుకలను ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు..

సందడే..సందడి
కాటన్‌మిల్‌ వద్ద గల వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు

- ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు

- రద్దీగా ఆలయాలు.. కిటకిటలాడిన పార్కులు

మహబూబ్‌నగర్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : న్యూ ఇయర్‌ వేడుకలను ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.. కోటి ఆశలతో జనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు.. బుధవారం ఉదయం నుంచే ఆలయాలకు రద్దీ పెరిగింది. పట్టణంలోని ప్రముఖ ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆలయం, లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం, శివాలయాలతో పాటు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం, మన్యెంకొండ, కురుమూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయం, జడ్చర్ల లలితాంబిక , మీనాంబరం ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఆలయాల వద్ద భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఏడాది తాము కోరుకున్న పనులన్నీ విజయవంతం కావాలని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో భాగంగా పాలమూరు పట్టణంలోని ప్రముఖ పార్క్‌లు అర్బన్‌ఎకో మయూరి, పిల్లల మఱ్ఱి పార్కులు సందర్శకులతో కిటకిటలాడాయి. ఎకోపార్క్‌కు వేల సంఖ్యలో సందర్శకులు తరలివెళ్లి సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ స్టేటస్‌లను నింపేశారు. పార్క్‌లోని అడ్వెంచర్‌లో సైక్లింగ్‌ చేస్తూ సరదాగా గడిపారు. అదే విధంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమఱ్ఱి పార్క్‌కు కూడా వేల సంఖ్యలో సందర్శకులు వెళ్లారు. రోజంతా పార్క్‌లలో సందడి చేస్తూ కొందరు అక్కడే కేక్‌లు కట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. మొత్తం మీద 2025 సంవత్సరానికి పాలమూరు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

భూత్పూర్‌ : మండల కేంద్రంలోని శివాలయం, సంజీవరాయు ఆలయం, మునిరంగస్వామి ఆలయాల్లో భక్తులు న్యూ ఇయర్‌ సందర్భంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమిస్తాపూర్‌ శివారులో ఉన్న సాయి ఆశ్రమంలో శ్రీషిర్డీ సాయి బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

జడ్చర్ల : జడ్చర్ల పట్టణంతో పాటు మండలంలోని ఆలయాలు బుధవారం కిటకిటలాడాయి. నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని గొల్లపల్లి శ్రీమలయాళస్వామి లలితాంబిక తపోవనంలో భక్తులు అమ్మ వారికి, శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు చేశారు. గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారికి పూజలు చేసేందుకు పట్టణవాసులు ఆలయానికి చేరుకున్నారు.

మిడ్జిల్‌ : మండలంలోని వెలుగొమ్ముల చెన్నకేశవస్మామి ఆలయం, రాణిపేట బంగారు మైసమ్మ ఆలయం, మిడ్జిల్‌ ఈదమ్మ ఆలయం, రెడ్డిగూడ శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

దేవరకద్ర : దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jan 01 , 2025 | 10:55 PM