Share News

దిష్టిబొమ్మల్లా క్రీడా ప్రాంగణాలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:17 PM

రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కంపచెట్లతో దర్శనమిస్తు న్నాయి.

దిష్టిబొమ్మల్లా  క్రీడా ప్రాంగణాలు
మల్దకల్‌ మండలం బూడిదపాడు గ్రామంలో కంపచెట్లతో దర్శనమిస్తున్న గ్రామీణక్రీడా ప్రాంగణం

- బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం

- గద్వాల జిల్లాలోని 255 గ్రామ పంచాయ తీల్లో ఇదే పరిస్థితి

- ఒక్కో ప్రాంగణం ఏర్పాటుకు రూ.60 నుంచి 80 వేల వరకు ఖర్చు

- ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ మార్పుతో నిలిచిన రూ. 2 కోట్ల బిల్లులు

అయిజటౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కంపచెట్లతో దర్శనమిస్తు న్నాయి. అప్పటి ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతీ గ్రామపంచాయ తీకి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ఆఘమేఘాల మీద వీటిని ఏర్పాటు చేసి నిర్వహణ గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం బోర్డులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

గద్వాల జిల్లాలో ఇలా..

జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వీటి ఏర్పాటుకు కావలసిన నిధులు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరు అవుతాయని చెప్పి ఆయా గ్రామపంచా యతీల సర్పంచులతో డబ్బులు ఖర్చుచేయించారు. ఒక్కో పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు రూ.60 నుంచి 80 వేల వరకు ఖర్చు చేశారు. మరికొన్ని పంచాయతీల్లో లక్ష రూపాయలకు పైగానే ఖర్చు చేశారు. అప్పట్లో మండలస్థాయి అధికారుల ఆదేశాలతో క్రీడా ప్రాంగణాలు చదును చేయటం, మొరం వేయటం, బోర్డు ఏర్పాటుతో పాటూ, క్రీడాకారులకు కావలసిన క్రీడా సామగ్రి కొనుగోలు తది తర ఖర్చులు సర్పంచులే భరించారు. ఈ విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో సూమారుగా రూ.80 వేల వరకు క్రీడా ప్రాంగణాల కోసం ఖర్చు అనుకు న్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్లపైనే ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. చాలా గ్రామాలలోని క్రీడా ప్రాంగణాల్లో నిర్వహణ లేక కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి.

బోర్డులు తప్ప, ఆటలు ఆడేందుకు ఏ మాత్రం అవకాశం లేని ప్రాంగణాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఆఘమేఘాలపై వీటిని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందే తప్ప క్రీడాకారులపై శ్రద్ధతో చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Jan 01 , 2025 | 11:18 PM