Bhatti Vikramarka: గురుకుల విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:51 AM
వసతి గృహాల్లోని విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కాస్మెటిక్ చార్జీలు పెంచామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులున్నా కాస్మెటిక్ చార్జీలు పెంచాం: భట్టి
బీబీనగర్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లోని విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కాస్మెటిక్ చార్జీలు పెంచామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎస్సీ, బీసీ గురుకుల బాలికల పాఠశాలలను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహాల్లోని వంట గదుల్లోకి వెళ్లి విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించి డైనింగ్ హాల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు.
వసతి గృహాల్లో శుభ్రత, భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన చార్జీల మేరకు హాస్టల్‌లో మెనూ అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు నెలలో ఒక్కసారి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు గు రుకులాలను సందర్శించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా నే తాను బీబీనగర్‌లోని గురుకుల పాఠశాలలను సందర్శించినట్లు చెప్పారు.