సమగ్ర భూసర్వేనే పరిష్కార మార్గం
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:56 AM
గ్రామ రెవెన్యూ వ్యవస్థను వికేంద్రీకరించి పటిష్ఠమైన యంత్రాంగాన్ని, రికార్డులను తయారుచేయాలనే సూచనలు వెల్లువెత్తుతున్నా యి. నిజాం హయాంలో సుమారు 90 ఏళ్ల క్రితం నిర్వహించిన భూసర్వే తప్ప ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు.
ధరణి గందరగోళానికి సర్వేతోనే సరి
కొత్త రెవెన్యూ రికార్డు తయారుచేయాలని నిపుణుల సూచన
నిజాం పాలన తర్వాత సర్వే కరువు
కాలానుగుణంగా మారిన భూ స్వరూపాలు
ఆక్రమణలు చెక్‌పెట్టేలా సంస్కరిస్తేనే ఫలితం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): గ్రామ రెవెన్యూ వ్యవస్థను వికేంద్రీకరించి పటిష్ఠమైన యంత్రాంగాన్ని, రికార్డులను తయారుచేయాలనే సూచనలు వెల్లువెత్తుతున్నా యి. నిజాం హయాంలో సుమారు 90 ఏళ్ల క్రితం నిర్వహించిన భూసర్వే తప్ప ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు. కాలక్రమంలో భూ స్వరుపాల్లో పలు మార్పులు జరగ్గా, తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సమగ్ర భూసర్వే, కొత్తగా భూ హక్కుల రికార్డులు తయారుచేయాలనే అభిప్రాయం సర్వ త్రా వ్యక్తమవుతోంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీఎల్‌వో (గ్రామస్థాయి అధికారి) నియామకాలకు కసరత్తు ప్రారంభించిం ది. ఈ నేపథ్యంలో భూసర్వే, కొత్త రికార్డులు, నక్షాలు, కొత్త పట్టాలు అందజేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజాం హయాంలో 1920 లో భూముల సమగ్రసర్వే నిర్వహించారు. అప్పటి పాలకులు, అధికారులైన జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములకు అనుగుణంగా భూ హక్కులు రూపొందించారు. గ్రామ రెవెన్యూ నక్షాలు తయారు చేశారు. భూమిపై సాగుదారులకు హక్కులు కల్పించగా, ప్రభుత్వ భూముల ను రకరకాల పేర్లతో నమోదుచేశారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి నక్షా, టీపన్లు తయారు చేశారు. దేవాదా య, ఇనామ్, అటవీ భూములను గుర్తించి రికార్డు ల్లో నమోదు చేశారు. అనంతరం ఇండియన్‌యూనియన్‌లో విలీనం తర్వాత ఖాస్రా, చౌఫస్లా రూపొందించారు. వాటి ఆధారంగా మొదటి ఆర్వోఆర్, రెండో ఆర్వోఆర్ రికార్డులు రూపొందాయి. భూసంస్కరణల తర్వాత మిగులు భూములు గుర్తించి సీలింగ్ పట్టా లు అందజేశారు. పేదలకు భూపంపిణీ చేసి అసైన్డ్ పట్టాలు అందజేశారు. రిజర్వ్‌ఫారెస్టు భూముల్లోనూ డీగ్రేడ్ ఫారెస్టులో, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినవారికి పట్టాలు అందజేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చా రు. దేవాదాయ, వక్ఫ్, ఇనామ్ భూముల్లోనూ పేదల కు పట్టాలిచ్చారు. అనంతరం ప్రాజెక్టులకు, కాల్వల నిర్మాణాలకు భూములను కేటాయించారు. ఇళ్ల స్థలా లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, రైల్వేలైన్ల నిర్మాణాలకు, పాఠశాలలకు, ఇతర ప్రభుత్వ, సామాజిక అవసరాలకు భూములకు కేటాయించా రు. కానీ, వీటన్నింటికి సంబంధించి రెవెన్యూ రికార్డు ల మార్పిడి సక్రమంగా జరగలేదు. దీంతో రికార్డుల న్నీ తారుమారయ్యాయి. 90 ఏళ్ల క్రితం రూపొందించిన టీపన్లు, పహానీలు, చౌఫస్ల రికార్డులు, నక్షాలు చెదలు పట్టాయి. కొన్ని చినిగిపోవడమే కాకుండా, కనిపించకుండా, గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. నక్షాల్లో హద్దులు చెరిగిపోయాయి. సర్వేనెంబర్ రాళ్లు సైతం కనిపించని పరిస్థితి ఉంది.
పేదలు, నిర్వాసితులకు పట్టాల ముసుగులో భూముల ఆక్రమణ
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970లో రిజర్వ్‌ఫారెస్టు భూమిలో డీగ్రేడ్ ఫారె్‌స్టను విడగొట్టి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయి నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు, భూములు అందజేయాలని నిర్ణయించారు. దీంతో పేదలకు, నిర్వాసితులకు డీఫారెస్ట్ పట్టాలు దక్కాయి. అయితే ఈ ముసుగులో రికార్డుల నిర్వహణ సరిగా లేక అవినీతికి పాల్పడడంతో పేదల, నిర్వాసితుల ముసుగులో అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ ముంపు నిర్వాసితులకు మేళ్లచెరువు, మఠంపల్లి, పాలకవీడు మండలాలతో పాటు దామరచర్ల, తిరుమలగిరి(సాగర్) మండలాల్లో అటవీభూముల్లో పట్టాలు, ఇళ్ల స్థలాలిచ్చారు. అయితే వీరితో పాటు అక్రమార్కులు సైతం అడ్డగోలుగా భూ ఆక్రమణలకు పాల్పడడంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురైంది. అంతేకాకుండా చెరువులు, కుంటలు, కందకాలు, డ్రైనేజీ కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయి. చివరకు శ్మశానవాటికల కోసం వినియోగిస్తున్న భూమి సైతం ఆక్రమణకు గురికావడం గమనార్హం.
ధరణితో మరింత గందరగోళం
గత బీఆర్‌ఎస్ హయాంలో భూరికార్డుల ప్రక్షాళన పేరుతో ధరణిని తీసుకురాగా, అక్రమాలు తొలగకపోగా, మరింత గందరగోళంగా రెవెన్యూ రికార్డులు మారాయి. భూములున్నవారికి పట్టాలు రాకపోతే, పట్టాలున్న వారికి భూములు లేని పరిస్థితి ఏర్పడింది. వేలాది మందికి భూమిలేకపోయినా భూహక్కు పత్రాలు వచ్చాయి. పేదలకు, సామాన్యులకు భూములున్నా వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. ఇలాంటి గందరగోళాన్ని నివారించేందుకే ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న తిరుమలగిరి(సాగర్) మండలంలో పూర్తిస్థాయి రెవెన్యూ సర్వేను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ సర్వే చేస్తున్న కొద్దీ పలు సమస్యలు వెలుగులోకి వస్తుండగా, వాటన్నింటినీ చట్టాలకు అనుగుణంగా, అవసరమైన సవరణలు చేపడుతూ వాస్తవికత, సామాన్యులు, పేదలకు ఇబ్బంది కలగకుండా రికార్డులు తయారు చేసి, సర్వే నిర్వహించారు.
రెవెన్యూ వ్యవస్థను మారుస్తున్నా పరిష్కారమవ్వని సమస్యలు
రాష్ట్రంలో 1984 నుంచి రెవెన్యూ వ్యవస్థలో సందర్భానుసారం మార్పులు చేస్తూ వచ్చినా సమస్యలు పరిష్కారమవకపోగా, ప్రతీ సందర్భంలో మరిన్ని కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత 1984లో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసి గ్రామ రెవెన్యూ అధికారులను నియమించారు. అనంతరం మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి 1992లో గ్రామ పరిపాలనాధికారి వ్యవస్థను తెచ్చారు. తిరిగి 1996-97లో గ్రామ కార్యదర్శులను తీసుకువచ్చారు. 2004-05లో మళ్లీ వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2022లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేశారు. ఇప్పుడు మళ్లీ తాజాగా గ్రామపాలనాధికారి (వీఎల్‌వో) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ 40 ఏళ్లలో పలు మార్పులు, సంస్కరణలు చేపట్టినా రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో భూముల పరిరక్షణ కొరవడింది. దొంగ పట్టాలు, భూముల ఆక్రమణలు పరిపాటిగా మారిపోయాయి.
సమగ్రసర్వే చేయాలని సూచనలు
గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పాత అనుభవాలన్నింటనీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర భూసర్వే నిర్వహించాలనే సూచనలు వస్తున్నాయి. భూసర్వేతో పాటు కొత్త నక్షాలు, కొత్త రెవెన్యూ రికార్డులు రాయాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుమలగిరి (సాగర్) తరహాలో ప్రైవేట్ సర్వేయర్లు కాకుండా ప్రభుత్వ సర్వేయర్లతో సమగ్రంగా భూముల సర్వే నిర్వహించి భూధార్ నెంబర్ లేక సర్వేనెంబర్లు కేటాయించాలని కోరుతున్నారు. కొత్త గ్రామ నక్షాలు, కొత్త రెవెన్యూ గ్రామాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ భూములకు కంచెలు వేయాలని, ప్రభుత్వ ఆస్తులైన దేవాదాయ, వక్ఫ్, రిజర్వ్‌ఫారెస్టు భూములకు, చెరువులు, కుంటలు, గ్రామకంఠం భూములకు, శ్మశానవాటికలకు హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు. ప్రతీ గ్రామపంచాయతీని ఒక రెవెన్యూ గ్రామంగా గుర్తించి రికార్డులు, నక్షాలు రూపొందించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త రెవెన్యూ రికార్డు రాయాలి
సాముల శివారెడ్డి, సమితి మాజీ అధ్యక్షుడు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్
నిజాం హయాం తర్వాత భూముల సర్వే జరగలేదు. రికార్డులన్నీ తారుమారయ్యాయి. ధరణి వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పేదల, ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. నక్షాలు, టీపన్లు శిథిలమయ్యాయి. భూమిలేనివారికి పట్టాలిచ్చారు. వీటన్నింటినీ సరిచేసేందుకు సమగ్రభూసర్వే నిర్వహించి, కొత్త రెవెన్యూ రికార్డులు రాయాలి. ప్రతీ పంచాయతీని రెవెన్యూ గ్రామంగా గుర్తించి గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలి. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశా. గత సీఎం కేసీఆర్‌కు కూడా పలుసూచనలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా సమగ్రభూసర్వే నిర్వహించి, కొత్త రెవెన్యూ రికార్డు, నక్షాలు తయారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నా.