Share News

అంతా ఏకమై.. ‘ఇథనాల్‌’పై పోరాటం

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:14 AM

అసలే ఈ గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. రెక్కాడితే గాని, డొక్కాడని పేద బతుకులు ఇక్కడ నివసిస్తుంటాయి. ఉన్న అరకొర భూమినే నమ్ముకున్న కుటుంబాలెన్నో. ఇలాంటి ఎన్నో జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది.

అంతా ఏకమై.. ‘ఇథనాల్‌’పై పోరాటం
సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఇథనాల్‌ కంపెనీలో బాయిల్‌ అయ్యే డ్రమ్ములు

సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు

పంటపొలాలు బీడుగా మారుతాయని ఆవేదన

ఎన్‌ఎమ్‌కే బయోఫ్యూయల్‌ ఇథనాల్‌ కంపెనీ ఎదుట నిరసనలు

కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఉద్యమం

మొదట విత్తనాల ఫ్యాక్టరీ అన్నారు.. తర్వాత ఇథనాల్‌ పరిశ్రమకు రంగం

కంపెనీ పరిధిలో 10 గ్రామాల ప్రజాభిప్రాయం సేకరించాలంటున్న ప్రజలు

సూర్యాపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అసలే ఈ గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. రెక్కాడితే గాని, డొక్కాడని పేద బతుకులు ఇక్కడ నివసిస్తుంటాయి. ఉన్న అరకొర భూమినే నమ్ముకున్న కుటుంబాలెన్నో. ఇలాంటి ఎన్నో జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది. సూర్యాపేట జిల్లా మోతె, ఆత్మకూరు(ఎస్‌) మండలాల్లోని భూములు బీడుగా మారి, తినేం దుకు పంటలు, తాగేందుకు నీరు కూడా దొరకదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మోతె, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల్లోని పల్లెలకు ఇథనాల్‌ పరిశ్రమ భయం పట్టుకుంది. దీంతో వారికి కంటిమీద కునుకు లేకుండా అయింది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిశ్రమ నిర్మాణం మాకొద్దు అంటూ పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు, రైతులు ఏకమై నెల రోజులుగా ఉద్యమిస్తున్నారు. వీరికి తోడు వామపక్షాలు అఖిలపక్షాలతో కలిసి గ్రామాల్లో ప్రజలకు ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో జరిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను ఒక్కతాటిపైకి తెస్తున్నారు.

సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రావిపహాడ్‌ గ్రామ సమీపాన 2019లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు విత్తనాల కంపెనీ ప్రారంభిస్తామని రావిపహాడ్‌కు చెందిన రైతుల నుంచి 22 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలుచేశారు. అనంతరం పారిశ్రామికవేత్త 15 ఎకరాల చుట్టూ 10 అడుగుల మేర ప్రహరీ నిర్మించి అందులో బోర్లను వేసిన తర్వాత అక్కడ విత్తనాల కంపెనీకి బదులు ఎన్‌ఎమ్‌కే బయోఫ్యూయల్‌ ఇథనాల్‌ కంపెనీ ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకుని 2022లో పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పలువురు గ్రామస్థులు కంపెనీ గురించి వివరాలు సేకరించారు. ఈ పరిశ్రమ వల్ల ప్రమాదం ఉందని అడ్డుకుంటున్న సమయంలో కంపెనీ నిర్వాహకులు రావిపహాడ్‌ గ్రామపంచాయితీ వద్ద గ్రామసభ నిర్వహించారు. ప్రజల సమక్షంలో కంపెనీ నిర్మాణంకోసం సర్పంచ్‌తో పాటు 10 మంది వార్డు సభ్యులు, గ్రామస్థులు కార్యదర్శితో కలిసి తీర్మాణంచేసి ఇవ్వడంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలనుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడంతో ఈ కంపెనీ నిర్మాణం నిలిపివేయాలని ఆందోళన చేస్తున్నారు.

రూ.200 కోట్లతో కంపెనీ నిర్మాణం

ఈ ఇథనాల్‌ కంపెనీ నిర్మాణం సుమారు రూ.200కోట్లతో చేపడుతున్న భారీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి 70శాతం సబ్సిడీ వస్తున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇథనాల్‌ కంపెనీ నిర్వహించాలంటే నూక లు, బియ్యం, మొక్కజొన్న, విత్తనాలతోపాటు కుళ్లిన చెరుకును ఉపయోగిస్తారు. వీటిని బాయిల్డ్‌ చేసేందుకు పెద్దఎత్తున ట్యాంకులను నిర్మిస్తారు. వీటి ద్వారా ఇథనాల్‌ రావాలంటే రోజూ లక్షల లీటర్ల నీరు అవసరమవు తుంది. ఈ నీటిని రావిపహాడ్‌కు సుమారు 10 కిలో మీటర్ల పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్‌ నుంచి పైపుల ద్వారా తరలించేందుకు సిద్ధంచేస్తున్నారు. ప్రతిరోజూ బాయిల్డ్‌ అయిన వాటి నుంచి లక్ష లీటర్ల పైబడి ఇథనాల్‌ బయటకు వస్తుంది. వీటిని పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తారు. రైతులకు పంటలు సాగుచేసుకునేందుకు ఉపయోగించాల్సిన నీరు ఇథనాల్‌ ఫ్యాక్టరీకి ఏవిధంగా అందిస్తారని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. 10 కిలోమీటర్ల నుంచి వస్తున్న పైపులను వేయకుండా ఎక్కడికక్కడే అడ్డుకుంటామని సర్వారం, కూడలి, రావిపహాడ్‌ గ్రామాల రైతులు చెబుతున్నారు.

కంనీనీ నిర్మాణం చేపడితే ఆందోళనలు తప్పవు

రావిపహాడ్‌ రెవెన్యూ పరిధిలో కంపెనీ నిర్మాణంకోసం అనుమతులు పొందారు తప్ప పక్క గ్రామాల నుంచి ఏవిధమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదు. మోతె మండలం సర్వారం, రామునితండ, అప్పన్నగూడెం, కూడలి, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం శెట్టిగూడెం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన రైతుల భూములు ఈ ఇథనాల్‌ కంపెనీకి ఆనుకుని ఉన్నాయి. వారికి విత్తనాల కంపనీ అని చెప్పడంతో ఆందోళన చేపట్టలేదు. ఇథనాల్‌ కంపెనీ నిర్మాణం అని తెలిశాక.. మా గ్రామాల రైతుల భూములు పంటలు కాలుష్యంతో నిండిపోతాయని ఈ గ్రామాల ప్రజలు, రైతులు అఖిలపక్షాల ఆధ్వర్యంలో వారితో కలిసి నెల రోజులనుంచి ధర్నాలు, నిరసనలు, కంపెనీ గేట్లను ధ్వంసం చేసి ఆందోళనలు చేపడుతున్నారు. సాయంత్రం అయితే కంపెనీ ముందు నుంచి వెళ్లాలంటే భయమేస్తోందని సర్వారం గ్రామ రైతులు పేర్కొంటున్నారు. రావిపహాడ్‌ రెవెన్యూ భూములు తక్కువగా ఉండడంతోనే రావిపహడ్‌ పంచాయతీ పాలకవర్గం అనుమతులు ఇచ్చిందని ఈ గ్రామల రైతులు ఆరోపిస్తున్నారు.

చర్చనీయాంశంగా మారిన ఇథనాల్‌ పరిశ్రమ

రాష్ట్రంలో రసాయన పరిశ్రమల ఏర్పాట్లపై నిత్యం ఏదో చోట ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లాలో సైతం ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం ఆపాలని సీపీఐఎమ్‌ఎల్‌(మా్‌సలైన్‌) మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు పరిశ్రమ ఎదుట ఆందోళనలు చేపట్టి ధర్నాను నిర్వహించారు. ధర్నాకు వచ్చిన మహిళలు గేట్లను ధ్వంసంచేసిన సంఘటనలు చోటుచేసుకోవడంతో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మోతె మండల ప్రజలతో పాటు ఆత్మకూర్‌(ఎస్‌) మండల ప్రజలు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమ్రోసీ, మాస్‌లైన్‌, పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు రావిపహాడ్‌, సర్వారం, కూడలి, శెట్టిగూడెం గ్రామాల మాజీ సర్పంచ్‌లు, రైతులతో కలిసి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వీటితోపాటు అఖిలపక్షం నాయకులు కంపెనీ చుట్టుపక్కల గ్రా మాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతీ రోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

ప్రభుత్వ భూమిని సైతం ఉపయోగిస్తున్నట్లు రైతుల ఆరోపణ

రావిపహడ్‌ గ్రామంలో సర్వే నెంబర్లు 128, 130, 132లలో 22 ఎకరాల పైగా వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. కంపెనీ నిర్మాణంకోసం 15 ఎకరాల చుట్టూ 10 అడుగుల మేర ప్రహరీ నిర్మించారు. ప్రహరీ నిర్మించాలన్నా గ్రామపంచాయతీ అధికారుల అనుమతులు ఉండాలి. కానీ అలాంటివేమి లేకుండా ఇష్టానుసారం వ్యవసాయ భూముల్లో భవనాలు, ప్రహరీలు నిర్మిస్తుంటే చుట్టుపక్క భూముల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం

2022లో ఇథనాల్‌ కంపెనీ నిలిపివేయాలని గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. వారికి తెలియకుండా గ్రామసభ ప్రజలందరి సమక్షంలో పెట్టకుండా గతంలో ఉన్న మాజీ సర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన ఓ మండల నాయకుడితోపాటు మరికొందరు తమ స్వలాభంకోసం గ్రామకార్యదర్శి తీర్మాణం ఇచ్చారు. కంపెనీ ఏర్పాటుకు సహకరిస్తున్న మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని అఖిలపక్షం నేతలు పేర్కొంటున్నారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో 50 కిలోమీటర్ల పాదయాత్ర

ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ రావిపహాడ్‌, అప్పన్నగూడెం, శెట్టిగూడెం, కూడలి, సర్వారం, రామునితండాల్లో కంపెనీ వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలు నిర్వహించారు. దీంతోపాటు ఇథనాల్‌ నిర్మాణం జరిగితే ప్రమాదాల గురించి వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. విడతలవారీ నిరసనలో భాగంగా పెద్దఎత్తున విద్యార్థి సంఘాలు, యువకులు ముందుకెళ్తున్నారు. పరిశ్రమ నిర్మాణం ఆగే వరకూ ఈ పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ

ఇథనాల్‌ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. పలు రకాలుగా ఆందోళనలు చేపడుతున్నా, కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేపడుతున్నా, పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు స్పందించి కంపెనీ వల్ల కలిగే నష్టాలను పరిగణ లోకి తీసుకొని కంపెనీ నిర్మాణాన్ని విరమింపజేయాలని స్థానికులు కోరుతున్నారు.

వ్యవసాయ భూములకు వెళ్లాలంటే భయమేస్తుంది

ఇథనాల్‌ పరిశ్రమ ప్రహరీలకు ఆనుకుని ఉన్న మా భూముల వద్దకు వెళ్లాలంటే భయమేస్తుంది. పెద్ద, పెద్ద డ్రమ్ములను ఏర్పాటుచేస్తుండడంతో భవిష్యత్‌లో భూములు పంటలు పండకపోగా కాలుష్యంతో ప్రాణాలు పోతాయని ఇప్పటికే ఆందోళన చెందుతున్నాం. కంపెనీకి ఆనుకుని మా భూములున్నా, మా అభిప్రాయం తీసుకోకుండా వారి ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది సరికాదు. ఈ ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం మొదలైనప్పటి నుంచి భూములను ఎవరూ కొనుగోలు చేయడం లేదు.

-ఉప్పుల లింగమ్మ, సర్వారం, సూర్యాపేట జిల్లా

ప్రజలకు హానికలిగించే ఇథనాల్‌ రద్దుచేయాలి

పరిశ్రమలు నిర్మించాలంటే వాటి వెంట ఉన్న ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. తమకు హాని ఉందని ప్రజలు ఆందోళనలు చేస్తే అధికారులు పర్యవేక్షించాలి. ఇక్కడి గ్రామాల ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాతే నిర్మించాలి. ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణంతో కాలుష్యంతో పల్లెలు, వ్యవసాయ భూములు నిండిపోతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయాలి.

-మట్టిపల్లి సైదులు, అఖిలపక్ష నేత, సూర్యాపేట జిల్లా

కంపెనీ అనుమతులు రద్దు చేసే వరకూ పోరాటం

ఇథనాల్‌ కంపెనీ అనుమతులు రద్దు చేసే వరకూ అఖిలపక్షం నాయకులు, ప్రజలకు మద్దతుగా విద్యార్థి సంఘాల తరఫున పోరాటం కొనసాగిస్తాం. ఈ కంపెనీ నిర్మాణం జరిగితే భవిష్యత్‌లో జరిగే పరిణామాలను ఎవరూ ఊహించలేరు. గ్రామంలో ఉన్న ప్రతీ ఒక్కరు ముందుకు కదలాలి. లేదంటే భవిష్యత్‌ అంధకారంలోకి వెళుతుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే కంపెనీ నిర్మాణం ఆపేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించాం.

-సింహాద్రి, పీడీఎ్‌సయూనేత, సూర్యాపేట జిల్లా

పూర్తి వివరాలు అందజేయాలని నిర్వాహకులను కోరాం

రావిపహాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఎన్‌ఎమ్‌కే ఇథనాల్‌ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు అందజే యా లని నిర్వాహకులను కోరాం. కంపెనీ ఏర్పాటుకు అను మతి పొందిన ధ్రువీకరణ పత్రాలను రెండు, మూడు రోజుల్లో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కంపె నీకి వ్యతిరేకంగా మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.

-సంఘమిత్ర, తహసీల్దార్‌, మోతె, సూర్యాపేట జిల్లా

Updated Date - Jan 06 , 2025 | 01:14 AM