కారుణ్య మరణానికి అనుమతించండి
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:48 PM
తనకు న్యాయం చేయడంలేదని, కారుణ్యమరణానికి అవకాశం కల్పించాలని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది.
పెద్దవూర, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : తనకు న్యాయం చేయడంలేదని, కారుణ్యమరణానికి అవకాశం కల్పించాలని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ప్లకార్డుతో ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంపోడు మండలం మొసం గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ 2008లో నిరసనమెట్ల రాములమ్మ వద్ద పెద్దవూర మండలం కొత్తలూరు రెవెన్యూ శివారులోని సర్వే నెంబరు 97ఊలోని రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన చేయించుకుంది. 2010లో పాస్‌బుక్ వచ్చింది. 2020 వరకు వెంకటమ్మే కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంది. కాగా గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తమ పేరు మీద ఉన్న రెండు ఎకరాలు నలుగురి పేరు మీద నమోదయ్యాయని తెలిపింది. అందులో ఇద్దరు ఆ భూమిని మరొకరికి విక్రయించారన్నారు. సమస్యను పరిష్కరించాలని రెండేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని, ఇటీవల ఆర్‌ఐ వచ్చి పంచనామా చేసి రిపోర్ట్ ఇచ్చినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఆనలైనలో ఎవరైతే నమోదులో ఉంటారో వారికి మేం మద్దతు తెలుపుతామని అంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పం దించి తమకు న్యాయం చేయాలని లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని సదరు మహిళ, ఆమె ఇద్దరు కుమారులు శివ, శ్రీకాంతలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. అరగంట అనంతరం వెంకటమ్మ, ఆమె కుమారులు ఆందోళన విరమించారు.