సందడిగా మూసీ ఆయకట్టు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:06 AM
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఆయకట్టులో రైతులు యాసంగి సీజనలో భారీగా వరి సాగు చేపట్టారు.
(ఆంధ్రజ్యోతి-కేతేపల్లి)
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఆయకట్టులో రైతులు యాసంగి సీజనలో భారీగా వరి సాగు చేపట్టారు. గత వానాకాలం సీజన్‌లో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసినా ఎగు వ నుంచి నిరంతరాయంగా వస్తున్న వరద నీటి తో పంటకాలం ముగిసే నాటికి ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని నకిరేకల్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో స్థిరీకరించిన 33వేల ఎకరాల భూముల్లో రైతులు యాసంగి వరి పంట సాగును చేపట్టారు. గత నెల 21న ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అధికారికంగా సాగు నీటిని విడుదల చేయడంతో అప్పటికే వరి నారు పెంపకం చేపట్టిన రైతులు ప్రస్తుతం పొలం దుక్కి పను లు పూర్తిచేసి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అక్రమంగా ఏర్పాటు చేసిన పంపుసెట్లతో నాన్‌ఆయకట్టులోని మరో 13వేల ఎకరాల మేర అనధికారికం గా పంటలు సాగు చేస్తున్నారు. ప్రాజె క్టు ప్రధాన కాల్వలతో పాటు వాటి డిసి్ట్రబ్యూటరీ కాల్వలపైనా అక్రమంగా విద్యుత్ పంపు సెట్లు ఏర్పాటు చేసి కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని తరలించి రైతులు కొన్నాళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మూసీ ఆయకట్టులో సక్రమ, అక్రమ ఆయకట్టు కలిపి దాదాపు 46వేల ఎకరాల మేర యాసంగి వరి పంట సాగవుతోంది. ఆయకట్టుకు తొలి విడత నీటి విడుదల గడువు మరో వారం రోజుల్లో పూర్తవుతుండడంతో రైతులు వరి నాట్ల పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయకట్టులో రైతులు, కూలీల సందడి నెలకొంది. మరోవైపు ఏఎమ్మార్పీ డీ-49కాల్వకు వారబందీ పద్ధతిన సాగునీరు విడుదలవుతుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం, కేతేపల్లి, చెరుకుపల్లి, కొర్లపహాడ్ గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల నీటిపై ఆధారపడిన రైతులు ఇప్పటికే వరి నాట్లు ముందస్తుగా పూర్తి చేశారు.
ఆధునిక సాగు వైపు అడుగులు వేస్తున్న రైతులు
దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయిక వరి సాగుతో ఏటేటా సాగు ఖర్చులు పె రుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు వైపు అడుగుల వేస్తున్నారు. వరిలో వెదజల్లడం, డ్రమ్‌సీడర్ వంటి ఆధునిక పద్ధతులు ఉన్నా ఇన్నాళ్ళూ ఆ దిశగా రైతులు దృష్టి సారించలేదు. వరి నా రు పెంచడం నుంచి నాటు వేసే వరకు ఎన్నో ఇబ్బందులు ఉండడం, నాటుకు కూ లీలకొరత తీవ్రంగా ఉండడంతో వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు నాటు కూలీ ఖ ర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం రైతులు వరి వెదజల్లడం, డ్రమ్‌సీడర్ వాడకంపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో కేతేపల్లి మండలవ్యాప్తంగా 100-150ఎకరాల్లో వెదజల్లడం, డ్రమ్‌సీడర్ సాగు చేసేవారు.ఈఏడాది యాసంగి సీజన్‌లో దాదాపు 450ఎకరాల్లో రైతులు వెదజల్లడం, డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగు చేశారు.
అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
ప్రస్తుత యాసం గి సీజన్‌లో పంటలు సాగు చేస్తున్న రైతుల అవసరాన్ని ఎరువు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. కేతేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు యూరియాను అధికధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో యూరియా బస్తా ఎమ్మార్పీ మేరకు రూ.266కు విక్రయించాల్సి ఉండగా మండల కేంద్రం కేతేపల్లిలో ఒక్కో బస్తాను రూ.300లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మారుమూల గ్రామాల్లోని వ్యాపారులు బస్తాకు రూ.50వరకు అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బిల్లు మాత్రం రూ.266లకే ఇస్తున్నారు.
క్రమంగా పడిపోతున్న ప్రాజెక్టు నీటిమట్టం..
మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఇటీవల తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు దాదాపు 20రోజులుగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదలవుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన గత నెల 21న ప్రాజెక్టు నీటిమట్టం 644.10అడుగులు(4.22టీఎంసీలు)గా ఉన్న నీటిమట్టం రెండున్నర అడుగుల మేర తగ్గి ప్రస్తుతం 641.58అడుగులు(3.59టీఎంసీ)లుగా నమోదయ్యింది. కాల్వలకు 440.32క్యూసెక్కులు విడుదల కాగా, ఆవిరి, సీపేజీ, లీకేజీలు, పంపుసెట్లు 31.24క్యూసెక్కులతో కలిపి మొత్తం అవుట్ ఫ్లో 471.56క్యూసెక్కులు కాగా ఇన్‌ఫ్లో 247.68క్యూసెక్కులుగా నమోదైంది.
ముమ్మరంగా వరి నాట్లు
కేతేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నా యి. మూసీ కుడి ప్రధాన కాల్వ ఆయకట్టుతో పాటు ఏఎమ్మార్పీ డీ-49కాల్వ ఆయకట్టు, భూగ ర్భ జలమట్టం పెరగడంతో చెరువులు, బావులు, బోర్ల ఆయకట్టులో రైతాంగం ఈ యాసంగిలో భారీగా వరి సాగు చేస్తోంది. గత వానాకాల సీజన్‌లో మండలవ్యాప్తంగా 20,672ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇది ప్రస్తుత యాసంగి సీజన్‌లో మరింత పెరిగింది. మండలంలోని మూసీ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు మండలంలోని చెరువులు, కుంటల ఆయకట్టులో దాదాపు 23వేల ఎకరాల వరకు వరి సాగవుతుంది.
సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోనూ
మేళ్లచెర్వు, జనవరి 8 (ఆంద్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల వ్యాప్తంగా ముమ్మరంగా వరినాట్లు కొనసాగుతున్నాయి. 9,580 ఎకరాలలో వానాకాలంలో సాగు చేయగా, యాసంగి సీజనలోనూ వరి పంటను సాగుచేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత సమృద్ధిగా ఉండటం, వరిలో ఆశించిన దిగుబడి, గిట్టుబాటు ధర లభించటంతో రైతులు వరి సాగుపై మక్కువ చూపిస్తున్నారు. వర్షాకాలంలో పత్తి వేసిన రైతుల సైతం కొన్ని ప్రాంతాలలో పత్తి పంట అనంతరం వ్యర్థాలను తొలగించి, వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరినాట్లు మండల వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. నాట్లుకు అనుబంధంగా వరి వెదజల్లడం పద్ధతి కొనసాగుతోంది. వరిలో నాటు కూలీల కొరత సమయభావంతో రైతులు విత్తనాలు వెదజల్లే ప్రక్రియ వైపు మొగ్గుచూపుతున్నారు. మేళ్లచెర్వు మండలంలో దాదాపు 600 ఎకరాల్లో వరి నాట్లకు స్వస్తి పలికి, వెదజల్లే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియతో 20 రోజులకే నాట్లు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో మరో వారంలో నాట్లు చివరిదశకు చేరుకోనున్నాయి.