Share News

ఏదుల-డిండి అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:32 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులు ఇక వేగవంతంకానున్నాయి.

ఏదుల-డిండి అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్‌

లైన్‌ అలైన్‌మెంట్‌కు కేబినెట్‌ ఆమోదం

రూ.1800కోట్లతో టెండర్లు పిలిచేందుకు సమ్మతి

పర్యావరణ అనుమతులూ వస్తే డిండి లిఫ్ట్‌కు సాఫీగా నీళ్లు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి- నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులు ఇక వేగవంతంకానున్నాయి. ఈ పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌నుంచి సాగునీటిని అందించే పనులను చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ఈ పనులు చేపట్టేందుకు రూ.1800కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ పనులకు టెండర్లు పిలవడంతోపాటు, ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులకోసం, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేసేందుకు సమాంతరంగా కార్యాచరణ అమ లు చేయాలని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ నిర్ణయించింది.

ఏదుల రిజర్వాయర్‌ నుంచి ఉల్పర బ్యారేజీవరకు అవసరమయ్యే లైన్‌ డిజైన్లకు మంత్రివర్గం శనివారం ఆమోద ముద్రవేసింది. వీటి నిర్మాణాలకు రూ.1800 కోట్ల అంచనాతో టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదనలను ఆమోదించిం ది. ఈనిర్మాణంలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌ నుంచి 800 మీటర్ల అప్రోచ్‌ ఛానల్‌, 2.525 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌, తొమ్మిది మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్‌, మళ్లీ 3.050 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ నిర్మిస్తారు. మొత్తం 21.575 కిలోమీటర్ల తర్వాత ఈ నిర్మాణం దుందుభి నదిలోకి వెళుతుంది. అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపాడు చెక్‌డ్యామ్‌కు 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బ్యారేజీని నిర్మిస్తారు. అయితే పోతిరెడ్డిపాడు చెక్‌డ్యామ్‌ స్థానంలో రబ్బర్‌డ్యాం నిర్మిస్తారు. త్వరలోనే డిజైన్లకు తుదిరూపమిచ్చి గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

పర్యావరణ అనుమతులొస్తేనే..

ఏదుల-డిండి అనుసంధానానికి, వాటి పనులు చేపట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినప్పటికీ ఈ లింక్‌ ద్వారా ఎలాంటి ఆటంకాల్లేకుండా నీరందాలంటే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. పర్యావరణ అనమతులొస్తేనే ఏదులకు నార్లాపూర్‌ నుంచి పూర్తిస్థాయి నీరందుతుందని, తద్వారా ఏదుల నుంచి డిండికి రావాల్సిన 30 టీఎంసీల నీరు సీజన్‌లో చేరుతుందని చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకంపై జాతీయగ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పర్యావరణ ఉల్లంఘన కేసు నమోదవడంతో, కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసు క్లియరెన్స్‌, కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం బాధ్యతలను ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఆసంస్థకు రూ.87.95లక్షల మొత్తాన్ని కూడా చెల్లించింది. ఈ అనుమతుల కోసం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో చర్చలు జరుపుతోంది. ఈ క్లియరెన్సులు వస్తేనే పనులు ఎలాంటి ఆటంకాల్లేకుండా పూర్తవడంతోపాటు కేటాయింపుల మేరకు నీరు డిండి ఎత్తిపోతలకు చేరనుంది. పాలమూరు-రంగారెడ్డిలో కీలకమైన నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న 145మెగావాట్ల సామర్థ్యంగల ఎనిమిది పంపులు పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉండగా, కేసుల ప్రభావంతో కేవలం రెండింటినే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఏదుల-డిండి లింక్‌ పనులు చేపట్టడంతోపాటు, మరోవైపు దిగువన రిజర్వాయర్ల పెండింగ్‌ పనులు, పెండింగ్‌ భూసేకరణ పనులు, కాల్వల నిర్మాణ పనులు సమాంతరంగా చేపట్టి పూర్తిచేయాలని, అదే సమయంలో కేంద్ర అనుమతులు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్‌ అధికారులకు సూచించారని ఇంజనీర్లు తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 01:32 AM