Share News

Gutha Sukender Reddy: ప్రభుత్వం యాదగిరిగుట్టకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి..

ABN , Publish Date - Mar 18 , 2025 | 10:11 PM

తెలంగాణ శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

Gutha Sukender Reddy: ప్రభుత్వం యాదగిరిగుట్టకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి..
Yadagirigutta Temple

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట బోర్డుకు నిబద్ధత గల అధికారిని నియమించాలని కోరారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి , గుళ్ల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సాధ్యమయింది. 1800 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట నిర్మించడం చాలా గొప్ప విషయం. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారు. విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడం కోసం ఎందరో దాతలతో మాట్లాడారు.


కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఎందరో దాతలు బంగారం సమర్పించారు. అద్భుతమైన కాటేజీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలి’ అని విజ్ణప్తి చేశారు. కాగా, తిరుమలలో టీటీడీ తరహాలో.. యాదగిరిగుట్లలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకే బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారని, వారి పదవి కాలం రెండేళ్లు ఉంటుందని ఆమె అన్నారు. టీటీడీ తరహాలోనే వైటీడీ బోర్డుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, విద్య వ్యాప్తికి కృషి చేస్తామని అన్నారు.


యాదగిరిగుట్ట చరిత్ర ఇది..

లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రమే యాదగిరిగుట్ట. యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చరిత్ర చెబుతోంది. స్థానికులు ఈ ప్రాంతాన్ని యాదగిరి గుట్ట లేదా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు. కేవలం తెలంగాణ చుట్టు పక్కల నుంచే కాదు.. దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆలయం కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడింది.


ఇవీ చదవండి:

నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే వినాలా: దానం

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం.. 30 ఏళ్ల కల సాకారం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 10:11 PM