తెలంగాణ సాధనకు పరితపించిన జిట్టా
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:22 AM
తెలంగాణ సాధనకు, ప్రజావసరాలు తీర్చేందుకు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి జీవితాంతం పరితపించారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ కోదండరాం
భువనగిరిలో జిట్టా విగ్రహావిష్కరణ
భువనగిరి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధనకు, ప్రజావసరాలు తీర్చేందుకు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి జీవితాంతం పరితపించారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వినూత్న ఆలోచనలతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసిన ఘనత జిట్టాది అన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ఆటపాటలు, రుచులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతనిదేనన్నారు. ఈ సందర్భంగా జిట్టాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి ప్రభుత్వం పక్షాన న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఫ్లోరైడ్ రక్కసి నుంచి కాపాడేందుకు సొంత నిధులతో ఊరూరా వాటర్ ఫిల్టర్స్‌ను ఏర్పాటు చేయడం అతని గొప్పతనానికి నిదర్శనమన్నారు. మూసీ నది ప్రక్షాళన లక్ష్యంగా చేపట్టిన పాదయాత్రతోనే అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక వచ్చిందన్నారు. నిమ్స్, ఎయిమ్స్, మూసీ సాగునీటి కాల్వలు తదితర అన్ని ప్రజా అంశాలపై నిత్యం పోరాటాలు చేశాడని, కానీ ఆయనకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు. నమ్ముకున్న వాళ్లే జిట్టాను మోసం చేశారన్నారు. తెలంగాణ సాధనలో అన్ని రకాలుగా నష్టపోయిన జిట్టా కుటుంబానికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ కళాకారుడు ఏపూరి సోమన్న ఆటపాటలతో జిట్టాను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి తండ్రి జిట్టా బాల్‌రెడ్డి, భార్య జిట్టా సునీత, మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అవేజ్ చిస్తీ, జిట్టా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.