Share News

న్యూ ఇయర్‌ జోష్‌

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:10 AM

నూతన సంవత్సరం 2025 వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో కేక్‌ కటింగ్‌లు, విందు, మందుతో మంగళవారం రాత్రి నుంచే నూతన సంవత్సర వేడుకలకు జోష్‌ నింపారు. కొంత మంది గ్రూపులుగా ఏర్పడి కుటుంబ సభ్యులతో కలిసి రిసార్టులు, బాంకెట్‌ హాల్స్‌, పట్టణ శివారు గెస్ట్‌ హౌస్‌లలో వేడుకలు నిర్వహించారు.

న్యూ ఇయర్‌ జోష్‌

మిన్నంటిన సంబరాలు

అర్ధరాత్రి కేక్‌ కటింగ్‌

ఉదయం ఆలయాల్లో బారులు తీరిన భక్తులు

ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): నూతన సంవత్సరం 2025 వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో కేక్‌ కటింగ్‌లు, విందు, మందుతో మంగళవారం రాత్రి నుంచే నూతన సంవత్సర వేడుకలకు జోష్‌ నింపారు. కొంత మంది గ్రూపులుగా ఏర్పడి కుటుంబ సభ్యులతో కలిసి రిసార్టులు, బాంకెట్‌ హాల్స్‌, పట్టణ శివారు గెస్ట్‌ హౌస్‌లలో వేడుకలు నిర్వహించారు. వారితో పాటు యువత, విద్యార్థులు వారి విద్యాసంస్థల్లో వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు వారి ఇళ్ల ముందు వివిధ రకాల రంగులతో ముగ్గులు వేసి సందడి చేశారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటలకు గత ఏడాది 2024కు వీడ్కోలు పలుకుతూ, నూతన ఏడాది 2025కు స్వాగతం పలుకుతూ ఆటాపాటలతో సంబరాలు నిర్వహించారు.

నూతన సంవత్సర వేడుకలకు జిల్లా ప్రజ లు పెద్ద మొత్తంలో కేక్‌లు, స్వీట్లు, ఇతర తినుబండరాలతో పాటు మద్యం కోసం అధికంగా ఖర్చుచేశారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు తెరిచే ఉంచడంతో పెద్ద మొత్తంలో వ్యాపారం నడిచినట్టు వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ.2. 50కోట్ల విలువైన మద్యం, మాంసంతో పాటు కేక్‌ లు,ఇతర ఆహార పదార్థాలకు మరో రూ.50లక్షల వరకు వ్యయం జరిగినట్టుగా అంచనా. జిల్లా కేం ద్రం భువనగిరితోపాటు చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లితో పాటు అన్ని మండల కేంద్రాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన వారితో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది. జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌గేట్ల వద్ద రద్దీ ఏర్పడింది.

ఆలయాల్లో భక్తుల రద్దీ...

నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని ప్రజలు ఆలయాలకు క్యూకట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 75వేల మంది భక్తులు నృసింహుడిని దర్శించుకున్నారు. అదే విధంగా పచ్చల కట్టసోమేశ్వర ఆలయం, సాయిబాబా ఆలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, అయ్యప్ప ఆలయం, సీతారామచంద్ర ఆలయం, మురళీ కృష్ణ ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొలనుపాక, ఆలేరు, మత్సగిరి, బీబీనగర్‌ పడమటి సోమారం, పోచంపల్లి మండలం దేశ్‌ముఖీ సాయిబాబ ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలపై తిరుగుతూ ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి 10 గంటల నుంచే పెట్రోలింగ్‌ నిర్వహించారు. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి, భువనగిరి, ఆలేరు, గుట్ట, చౌటుప్పల్‌ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ ముమ్మరంగా చేశారు. దీంతో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టగలిగారు. అదే విధంగా డీజే సౌండ్‌లకు అనుమతులు ఇవ్వలేదు. రోడ్లపై కేక్‌ కటింగ్‌లు లేకుండా చూడారు. యాదాద్రి జిల్లాలో ప్రధాన రహదారులపై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. దీంతో జిల్లాలోని మూడు ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 84మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 800, డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు 200 నమోదు చేశారు. వీటితో పాటు నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న 89 మందిపై కేసులు నమోదు చేసి ఆ వాహనాలను సీజ్‌ చేశారు.

పెరిగిన మద్యం అమ్మకాలు

వేడుకల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయ. యాదాద్రి జిల్లాలో రూ.2.50కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 99 వైన్స్‌లు, 15 బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకు సాగాయి. డిసెంబరు 30, 31 తేదీల్లో రూ.20కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సుమారు 13వేల బీర్ల కాటన్లు, 10వేల లిక్కర్‌ కాటన్లు విక్రయాలు జరిగాయి. సాధారణ రోజుల్లో ప్రతీ రోజు సుమారు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అదనంగా రూ.6కోట్ల నుంచి 8కోట్ల వరకు విక్రయాలు జరిగాయి.

కొత్త ఏడాది ఖర్చు రూ.42.69కోట్లు

కోదాడ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వాసులు ఒక్క రోజులో రూ.42.69కోట్లు ఖర్చు చేశారు. యువతి, యువకులు బేకరి ఐటమ్స్‌, స్వీట్స్‌పై, మద్యం ప్రియులు మద్యం, మాంసంపై, మహిళలు ముగ్గులపై ఖర్చు చేశారు. మొత్తంగా డిసెంబరు 31న ఒక్క రోజులో ఉమ్మడి జిల్లావాసులు సుమారు రూ.42.69కోట్లు ఖర్చు చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 299 వైన్స్‌ దుకాణాలు ఉన్నాయి. సుమారు 150 రెస్టారెంట్‌లు, హోటల్స్‌, 240 చికెన్‌ దుకాణాలు, 120 బేకరీలు, 144 స్వీట్‌ దుకాణాలు ఉన్నాయి. డిసెంబరు 31న రెస్టారెంట్స్‌, హోటళ్లలో ఉమ్మడి జిల్లా వాసులు సుమారు రూ.1.50కోట్లు, చికెన్‌పై రూ.2.04కోట్లు, బేకరి ఐటమ్స్‌పై రూ.2కోట్లు, స్వీట్స్‌పై రూ.2కోట్లు, మొత్తంగా ఒక్క రోజులో సుమారు రూ.7.54కోట్లు ఖర్చు చేశారు. మటన్‌, పిష్‌, మహిళలు రంగులపై చేసిన ఖర్చు మరో రూ.25లక్షలు అదనంగా ఉంటుంది. కాగా, మద్యంపై 31న రూ.29.90కోట్లు, 30న అదే స్థాయిలో విక్రయాలు జరిగాయి. పుడ్‌ ఐటమ్స్‌పై రూ.5కోట్లు, మొత్తంగా రూ.42.69కోట్లు ఖర్చు చేశారు.

Updated Date - Jan 02 , 2025 | 12:10 AM