Share News

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతోషం

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:26 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నేరేడుచర్ల పట్టణం, మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతోషం

భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరేడుచర్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నేరేడుచర్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నేరేడుచర్ల పట్టణం, మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో నేరేడుచర్లలో హెలీప్యాడ్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక ఏం చేయాలో పాలుపోక అక్కసుతో ఏవేవో మా ట్లాడుతున్నారు తప్ప ఏ కోణంలో చేసినా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో ముందుకు పోతున్నామన్నారు. ఏ రాష్ట్రం సాధించని సామాజిక న్యాయం తెలంగాణలో పాటిస్తున్నామన్నది, అన్ని వర్గాల వారికి తెలుసన్నారు.

ఏడాది పాలనలో యువతకు పెద్దపీట

ఏడాది కాలంలో 55వేల ఉద్యోగాలు ఇచ్చి యువతకు పెద్దపీట వేశామ ని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. విద్యార్థులకు అన్నిరకాలుగా మేలు చేసేందు కు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. దేశంలో అతి ఎక్కువ సొమ్ము రుణమాఫీకి ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. రూ. 2,500 కోట్లు రైతు భరోసాకు కేటాయించామన్నారు. ప్రతి ఎకరాకు ఏడాదికి 12వేలు ఇస్తున్నామని, ఇప్పుడు సంక్రాంతి తరువాత వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

పంట వేయకపోయినా ‘రైతు భరోసా’

వ్యవసాయ యోగ్యమైన భూమిలో పంట వేయకపోయినా రైతు భరో సా అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ ప్రభు త్వం ఇవ్వని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణలో రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలాయని, బీర్ల తయారీకి, కోళ్లదాణాకు పనికి వచ్చాయని, పేదలకు ఉపయోగపడకుండా పోయాయన్నారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని, అలాగే పాత రేషన్‌ కార్డుల్లో పేర్ల నమోదు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ పాల్గొన్నారు.

‘హుజూర్‌నగర్‌’ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేరేడుచర్ల పట్టణంలో, దిర్శించర్ల, కల్లూరు గ్రామాల్లో రూ.18.57కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొణతం చిన వెంకటరెడ్డి, నూకల సందీ్‌పరెడ్డి, చలసాని రాజీవ్‌, ఐజేయూ నాయకులు కొంజేటి సత్యనారాయణ, మునిసిపల్‌ చైర్మన్‌ బచ్చలకూరి ప్రకాష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అలక సరిత, మార్కెట్‌ చైర్మన్‌ బెల్లంకొండ విజయలక్ష్మి, గోపాల్‌, మోతీలాల్‌, నర్సింహారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:26 AM