Share News

సామాన్యులపై ధరాఘాతం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:49 AM

సంక్రాంతి పండుగ పూట కడుపు నిండా తినేపరిస్థితి లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు పండగను సంతోషంగా జరుపుకుందామంటే పెరిగిన నిత్యావసర ధరలతో బెంబెలెత్తిపోతున్నారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేయక పోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

సామాన్యులపై ధరాఘాతం

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు!

సంక్రాంతివేళ ఆకాశాన్నంటిన ధరలు

మండిపోతున్న కూరగాయలు, నిత్యావసర సరుకులు

ధరలపై ప్రభుత్వ నియంత్రణ కరువు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ, సూర్యాపేట టౌన్‌): సంక్రాంతి పండుగ పూట కడుపు నిండా తినేపరిస్థితి లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు పండగను సంతోషంగా జరుపుకుందామంటే పెరిగిన నిత్యావసర ధరలతో బెంబెలెత్తిపోతున్నారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేయక పోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని వస్తువులనైతే బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దీంతో వ్యాపారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. హోల్‌సేల్‌ రిటైల్‌ అనే తేడా లేకుండా ప్రతి వస్తువుపైనా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సామాన్యుడు ఇది ఏమిటని అడిగే పరిస్థితి కానరావడం లేదు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో మండిపోతున్న ధరలను చూసి సామాన్యులు విలవిల లాడుతున్నారు. కూరగాయల ధరలను పరిశీలిస్తే చిక్కుడు కాయ, బెండకాయ కిలోకు రూ.100కు చేరుకోగా, దొండ కాయ, గోకరకాయ కిలోకు రూ.80 వెచ్చించాల్సి వస్తుంది. ఇక మునగకాయ అయితే కిలోకు రూ.160చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఎల్లిగడ్డ కిలో రూ.300, ఎండుమిర్చి కిలో రూ.170, కందిపప్పు కిలో రూ.150 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో బెల్లం నిల్వలు సరిపడా లేవు. బెల్లం ధర ప్రస్తుతానికి నిలకడగానే ఉంది.

ప్రభుత్వంనుంచి అదనపు రేషన్‌ లేనట్లే..

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తొమ్మిది రకాల సరుకులతో కూడిన నిత్యావసర వస్తువులు, రేషన్‌ ఇచ్చే వారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 11ఏళ్ల కాలంలో ప్రతినెలా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీ దొడ్డు బియ్యాన్ని సరఫరా చేయడం తప్ప ఎలాంటి అదనపు సరుకులు ఇవ్వడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో బెల్లం, చింతపండు, పప్పు, నూనె, గోధుమపిండి, చక్కెర, ఇంకా ఇతర మరో మూడు సరుకులను ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప అది కూడా ఒక్కో మనిషికి ఆరుకిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. సంక్రాంతి నుంచి రేషన్‌ షాపుల నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నా ప్రభుత్వం మరోసారి వాయిదావేసింది. కనీసం పేద, మధ్యతరగతి ప్రజలు తెల్లరేషన్‌కార్డు ద్వారా పొందే బియ్యాన్ని కూడా అధికంగా ఇవ్వని పరిస్థితులున్నాయి. సంక్రాంతి నుంచి సన్నబియ్యం వస్తాయని ప్రజలు ఎంతో ఆశపడినప్పటికీ మరోసారి నిరాశ, నిస్పృహలు తప్పలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రతి నెలా 13 నుంచి 14వేల క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యా న్ని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. చాలా చోట్ల రేషన్‌ షాపు డీలర్లు తమ షాపుల్లో వ్యాపారుల నుంచి కొనుగోలు చేసుకొని వచ్చిన కొన్ని నిత్యావసర వస్తువులను మార్కెట్‌లో ఉన్న రేట్లకే విక్రయిస్తుంటారు. ముఖ్యంగా నూనెతోపా టు గోధుమపిండి, సబ్బులను విక్రయిస్తున్నారు. వాస్తవానికయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిత్యావసర సరుకులు రేషన్‌ షాపునుంచి రాకపోవడంతో కొనుగోలు చేయక తప్పడంలేదు.

ఇతర ప్రాంతాల నుంచి సరుకుల దిగుమతితో..

ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు కూడా వస్తువులపై పడుతున్నట్లు సమాచారం. కూరగాయలు కర్నూల్‌, అనంతపురంతోపాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి వస్తుండగా నిత్యావసర వస్తువులు మాత్రం గుజరాత్‌, రాజస్థాన్‌, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చేరుస్తారు. రాష్ట్ర రాజధాని సరిహద్దులో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున కూరగాయల సాగు చేపట్టి ధరలు నియంత్రిస్తామని గత ప్రభుత్వం స్పష్టం చేసి ఉద్యానశాఖను అప్రమత్తం చేసింది. అయితే గత ప్రభుత్వ ఆలోచన కాగితాలకే పరిమితంకావడంతో జిల్లాలో కూరగాయాల సాగు విస్తరించలేదు. చాలామంది రైతులు తమ కుటుంబ అవసరాలకు సరిపడా ఏదో ఒక చిన్న మడిలో కూరగాయలు సాగు చేస్తున్న పరిస్థితి. అత్యధికంగా పెద్ద అడిశర్లపల్లి మండలంలో దొండసాగు ఉన్నప్పటికీ దొండకాయ కిలో రూ.80 పలుకుతుంది. అయితే మార్కెట్‌లోకి వచ్చే సరికి కిలో ధర రూ.80 ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడంలేదు. దళారులు మాత్రమే ఈ దొండ విక్రయాల వల్ల లాభం పొందుతున్నారు.

మాంసం ధరలకు రెక్కలు

సామాన్యులు మాంసం కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పండుగవేళ కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్కపూట భోజనం చేయాలన్న మాంసం కోసం రూ.1000 ఖర్చు చేయాల్సి వస్తోంది. వారం రోజులుగా చికెన్‌, మటన్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత వారం క్రితం చికెన్‌ కిలో రూ.170 ఉండగా, ప్రస్తుతం రూ.200 నుంచి రూ.210 వరకు విక్రయిస్తున్నారు. పండుగరోజు మరింతగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 10 రోజుల క్రితం మటన్‌ రూ.800 ఉండగా ప్రస్తుతం రూ.950 వరకు చేరింది. ఇది చాలదన్నట్లు పండగ రోజు వ్యాపారులు తాజా మటన్‌ పేరుతో మరింత ధరలు పెంచే అవ కాశం లేకపోలేదు.

రూ.500కు ఏం రావడం లేదు : ప్రేమలత, గృహిణి

రూ.500 తీసుకొని మార్కెట్‌కు వెళితే ఏంరావడంలేదు. పెరుగుతున్న ధరలను చూస్తే భయమేస్తుంది. ఇలాగే ఉంటే బతకడం కష్టం. ప్రభుత్వాలు నిత్యావసర ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉచితాల బదులు వీటిపై దృష్టి సారిస్తే బాగుంటుంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంవల్ల పండుగ చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వం నిత్యావసర ధరలను నియంత్రించాలి.

ధరలు మండి పోతున్నాయి: కె. రవేల, గృహి ణి.

నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాగే ఉంటే సంక్రాంతి పండగ చేసుకోవడం కష్టమే. కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. కిలో ఎల్లిగడ్డ రూ.300కు విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు పరిస్థితి అంతే ఉంది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో కనీసం చౌకధరల దుకాణాల ద్వారానైనా నిత్యావసరాలు అందించాలి. ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరిగిన పిండి వంటల ధరలు: ముల్కలపల్లి అనూష, సూర్యాపేట నివాసి

పెరిగిన ధరలతో పిండి వంటలు చేయించే పరిస్థితి లేదు. గత ఏడాది రూ.1000కే పిండి వంటలు చేయిస్తే, ఈ సంవత్సరం రూ.1500 వరకు ఖర్చు వస్తుండటంతో రెడీమెడ్‌ వంటకాలే తక్కువ ధరల్లో కొనుగోలు చేశాను.

నిత్యావసర వస్తువుల ధరలు..

చింతపండు 120

ఎర్ర పప్పు 90

పెసరపప్పు 120

కందిపప్పు 150

ఎండుమిర్చి 170

సన్‌ఫ్లవర్‌ 145

పల్లి నూనె 150

పామాయిల్‌ 135

పసుపు(100గ్రా) 25

చక్కెర 42

బెల్లం 60

ధనియాలు 120

జీలకర్ర(100గ్రా) 40

అల్లం 60

ఎల్లిగడ్డ 300

ఉల్లిగడ్డ 40

కూరగాయల ధరలు..

టమాట 10

బెండకాయ 100

చిక్కుడుకాయ 100

బీరకాయ 100

ఆలుగడ 40

దోసకాయ 50

కాకరకాయ 40

వంకాయ 40

క్యారెట్‌ 50

క్యాబేజీ 50

దొండకాయ 80

గోకరకాయ 80

మునగకాయ 160

క్యాలీఫ్లవర్‌ 50

క్యాప్సికం 100

Updated Date - Jan 12 , 2025 | 12:49 AM