‘ఆత్మీయ భరోసా’ కల్పించరూ..
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:17 AM
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తమకూ వర్తింపజేయాలనే డిమాండ్ పట్టణ ప్రాంత వ్యవసాయకూలీల నుంచి బలంగా వినిపిస్తోంది. భూమిలేని వ్యవసాయకూలీలకు ఈపథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ప్రోత్సాహకం అందజేస్తామ ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తమున్సిపాల్టీలు, విలీన గ్రామాల్లో పథకాన్ని పొందలేకపోతున్నవైనం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీగా పథకాన్ని కోల్పోతోన్న కూలీలు
నల్లగొండ, జనవరి 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తమకూ వర్తింపజేయాలనే డిమాండ్ పట్టణ ప్రాంత వ్యవసాయకూలీల నుంచి బలంగా వినిపిస్తోంది. భూమిలేని వ్యవసాయకూలీలకు ఈపథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ప్రోత్సాహకం అందజేస్తామ ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులను మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైన కూలీల ద్వారా (జాబ్‌కార్డులు) గుర్తించాలని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం సూచించింది. ఈ పథకంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20రోజులు పనిచేసిన కూలీ కుటుంబా న్నే అర్హత కలిగిన కుటుంబంగా గుర్తించాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పట్టణప్రాంతా ల్లో, ప్రధానంగా నూతనంగా ఏర్పాటైన మున్సిపాల్టీల్లో, పెద్ద మున్సిపాల్టీలను విస్తరించే క్రమంలో విలీనం చేసి న గ్రామాల్లో, మున్సిపాల్టీగా మార్చినప్పటికీ వ్యవసాయమే ప్రధానంగా ఉన్న పట్టణాల్లోని వ్యవసాయ కూలీలు తమకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాల ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 40 శాతం మేర పట్టణీకరణ జరిగిందని, పౌరసేవల సౌల భ్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్మార్ట్ పాలన పేరు తో పదివేల జనాభా ఉన్న ప్రాంతాలనూ మున్సిపాల్టీలుగా మార్చారని పేర్కొంటున్నారు. దీంతో తమకు ఒరిగిందేమీ లేకపోగా, కనీస పని గ్యారంటీ కల్పించే ఉపాధి హామీ పథకాన్ని కోల్పోగా, తాజాగా ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దూరమవ్వాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో దూరమవనున్న వ్యవసాయకూలీలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఏర్పాటైన కొత్త మున్సిపాల్టీలు, పాత మున్సిపాల్టీల్లో విలీనం చేసిన గ్రామాల్లో భారీ సంఖ్యలో ఉన్న భూమిలేని వ్యవసాయకూలీలు ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దూరమవుతున్నారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లా కేంద్ర మున్సిపాల్టీనే పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ విలీన గ్రామాలైన మర్రిగూడ, చర్లపల్లి, ఆర్జాలబావి, ఖతాల్‌గూడ, కేశరాజుపల్లి, శేషమ్మగూడెంలలో మూడువేల పైచిలుకు భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలు ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నాయి. ఈగ్రామాలన్నీ మున్సిపాల్టీలో చేరడంతో ఈ కుటుంబాలన్నీ ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకాన్ని అందుకోలేపోతున్నాయి. హాలియా మున్సిపాల్టీని పరిశీలిస్తే ఇక్కడ అనుముల, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో దాదాపు 500 వ్యవసాయకూలీల కుటుంబాలు ఈ పథకానికి దూరమవుతున్నాయి. చిట్యాల మున్సిపాల్టీలో విలీనమైన శివనేనిగూడెంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా 300 పైచిలుకు కుటుంబాలు ఈ పథకానికి దూరమవుతున్నాయని కూలీలు వాపోతున్నారు. నకిరేకల్ మున్సిపాల్టీ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాల్టీల్లో సైతం ఇలా వందలాది కుటుంబాలు ఈపథకానికి దూరమవుతున్నాయని, ఈ పథకం అమలుపై ప్రభుత్వం తక్షణమే సవరణలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో, ప్రధానంగా విలీన గ్రామాల్లో ఉన్న భూమిలేని వ్యవసాయ కూలీలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం అందించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో తమకు అన్యాయం జరగనీయకుండా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమకు న్యాయంజరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కలెక్టర్లు కూడా సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాలని, తమకు న్యాయం చేయాలని పట్టణ ప్రాంత భూమిలేని వ్యవసాయకూలీలు విన్నవిస్తున్నారు.