దొడ్డు యూరియా పేరుతో దోపిడీ
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:05 AM
నాగార్జునసాగర్ ఆయకట్టులో దొడ్డు యూరియాపై రైతుల ఆసక్తి, మార్కెట్‌లో కొరతను ఆసరా చేసుకుని ప్రైవేట్ ఎరువుల దుకాణదారులు దోపిడీకి పాల్పడుతున్నారు.
బస్తాపై రూ.74 అదనపు వసూలు
సహకార సంఘాల్లో సన్న యూరియా
డీలర్ల వద్ద దొడ్డు యూరియా
రూ.15 కోట్ల మేర రైతుకు నష్టం
నాగార్జునసాగర్ ఆయకట్టులో దొడ్డు యూరియాపై రైతుల ఆసక్తి, మార్కెట్‌లో కొరతను ఆసరా చేసుకుని ప్రైవేట్ ఎరువుల దుకాణదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రతీ యూరియా బస్తాను రూ.74ల అధిక ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఈ సీజనలో 50 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 12 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియాను విక్రయించారు. ఇందులో 30 శాతం మేర 4 వేల టన్నుల వరకు దొడ్డు యూరియాను విక్రయించారు. దీని నుంచి సుమారు రూ.15 కోట్లకు పైగానే రైతుల నుంచి అదనంగా వసూలు చేసినట్లు సమాచారం.
(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్)
రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు, సన్న యూరియాలను బస్తా రూ.266లకే అందిస్తుంది. ఆ మేరకు సహకార సంఘాల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆయా కేంద్రాలకు దొడ్డు యూరియా రాష్ట్ర ప్రభుత్వం సరైన మోతాదులో సరఫరా కావడం లేదు. వారంలో ఒకటి రెండుసార్లు నల్లగొండ జిల్లాలోని బఫర్ స్టాక్ కేంద్రం మిర్యాలగూడకు యూరియా వ్యాగన్లు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి వరి సాగుకు సంబంధించి రైతులు పెద్దమొత్తంలో యూరియాను వినియోగంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైతులకు తక్కువ రేటుకు ప్రభుత్వం అందించే ధర ప్రకారం సహకార సంఘాల్లో సన్న యూరియా ఇస్తుండగా దొడ్డు యూరియా నామమాత్రంగా సరఫరా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క సహకార సంఘానికి 10 లారీల యూరియా సరఫరా చేస్తే వాటిలో 2 లేదా 3 లారీ దొడ్డు యూరియా మిగిలిన ఏడు లారీలు సన్న యూరియా అందజేస్తున్నారు. అదే ప్రైవేట్ డీలర్లకు 80 శాతం దొడ్డు యూరియా, 20శాతం సన్న యూరియా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులు ప్రైవేట్ డీలర్లు, వ్యాపారుల వద్ద దొడ్డు యూరియాను కొనుగోలు చేయాల్సి వస్తోంది. మార్కెట్‌లో డిమాండ్, సహకార సంఘాల్లో దొడ్డు యూరియా కొరతను పసిగట్టిన వ్యాపారులు దొడ్డు, సన్నరకం యూరియా బస్తాలకు రూ.340 తీసుకుంటున్నారు.అంటే ప్రతి బస్తాకూ రూ.74లు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఎకరాకు సుమారు మూడు బస్తాలు
వరి సాగు మొత్తంలో ఎకరానికి మూడు బస్తాల యూరియాను వినియోగిస్తుంటారు. ప్రాథమిక దశలో ఒక బస్తా యూరియా అవసరం ఉంటుంది. జిల్లాలో 6.35లక్షల ఆయకట్టు ఉండగా యాసంగిలో 5 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనాతో ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 2.5 లక్షల ఎకరాల వరకు సాగు చేసినట్లు భావిస్తున్నారు. కాగా యాసంగి సీజనకు 50వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం డీలర్లు, సహకార సంఘాల వద్ద 20వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాలు, రైతు సేవాకేంద్రాలు, ఎనడీసీఎంఎ్‌సలో యూరియాను మాత్రమే రూ.266లు విక్రయిస్తున్నారు. జిల్లాలో సహకార, రైతుసేవా కేంద్రాలు, ఎనడీసీఎంఎ్‌స కేంద్రాలు 155ఉండగా,ఫెర్టిలైజర్ దుకాణాలు 400లు పైనే ఉన్నాయి. 12వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే విక్రయించారు. ఇందులో 4వేల మెట్రిక్‌టన్నుల దొడ్డు యూరియా విక్రయించారు. అందులో ఒక్కో బస్తాపై రూ.74 అదనంగా వసూలు చేస్తున్నారన్న నేపథ్యంలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోళ్లకు సంబంధించి సుమారు రూ.15 కోట్లకు పైగా అదనంగా రైతుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డీలర్లు సిండికేట్‌గా మారడంతో పాటు వ్యవసాయ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని డీలర్లు నయా దందా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ బఫర్ స్టాక్ నుంచి రవాణా పేరుతో బస్తాకు రూ.74లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అక్రమాలకు జరుగుతున్నా పట్టించుకునే అధికారులు లేరు.
ఎమ్మార్పీకే యూరియా విక్రయించాలి
ఎమ్మార్పీ ధర ప్రకారమే యూరియా విక్రయించాలి. ప్రతి బస్తాపై రూ.74లు అదనంగా తీసుకోవడం సరికాదు. రైతుల శ్రమను ఫెర్టిలైజర్ దుకాణాల డీలర్లు దోచుకుంటున్నారు. ట్రాన్సఫోర్ట్ పేరుతో రూ.10, రూ.20 తీసుకోవచ్చు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్దఎత్తున రైతుల నుంచి యూరియాకు డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
జడ శ్రీనివాస్, రైతు, హుజూర్‌నగర్
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
యూరియాను ఎమ్మార్పీ ధర ప్రకారమే విక్రయించాలి. అధిక రేటుకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. మిర్యాలగూడలోని బఫర్ స్టాక్ నుంచి ట్రాన్సపోర్ట్ చేస్తున్నందున బస్తాకు రూ.10, రూ.20 తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వమే ట్రాన్సపోర్ట్ ఖర్చు భరిస్తున్నందున ఎమ్మార్పీ ధరలకే సరఫరా చేస్తున్నారు.
- శ్రీధర్‌రెడ్డి జేడీఏ, సూర్యాపేట జిల్లా