Share News

కత్తితో పొడిచి... మర్మాంగాలపై దాడిచేసి

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:14 AM

వరుసకు కుమారుడైన యువకుడిని భార్యాభర్తలు దారుణంగా హత్య చేశారు.

కత్తితో పొడిచి... మర్మాంగాలపై దాడిచేసి
శేషు(ఫైల్‌ఫొటో)

భూతగాదాలతో వరుసకు అన్నయ్య హత్య

ఆత్మకూర్‌ (ఎస్‌), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): వరుసకు కుమారుడైన యువకుడిని భార్యాభర్తలు దారుణంగా హత్య చేశారు. కుమారుడు కత్తితో పొడిచి... గొంతు కోయగా... బతికి ఉన్నాడేమోననే అనుమానంతో మర్మాంగాలపై దాడిచేశారు.. భూతగాదాల నేపథ్యంలో మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్‌తండాలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ మహేశ్వర్‌, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీనాయక్‌తండాకు చెందిన ధరావత లక్ష్మణ్‌ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా కుమారుడు శేషు(35) ఉన్నాడు. లక్ష్మణ్‌ సోదరులు శ్రీను, వెంకన్నలు వ్యవసాయం చేస్తున్నారు. వెంకన్న కుమారుడు దీపక్‌ తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటాడు. ముగ్గురు సోదరులు లక్ష్మణ్‌, శ్రీను, వెంకన్నల మధ్య 2017నుంచి భూతగాదాలు ఉన్నాయి. భూపంపిణీలో తేడాలు రావటంతో ముగ్గురి మధ్య ఘర్షణలు నెలకొని పెద్దమనుషుల మధ్య మాట్లాడుకుంటున్నారు. లక్ష్మణ్‌ కుమారుడు శేషు(35) వ్యవసాయం చేయడంతో పాటు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని అంబులెన్సుకు ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శేషు మంగళవారం రాత్రి 12గంటలకు విధులు ముగించుకుని, బైక్‌పై లక్ష్మీనాయక్‌తండాకు బయలుదేరాడు.మార్గమధ్యలో తండా సమీపంలో ఎస్సారెస్పీ కాలువ సమీపంలోశేషు బాబాయి ధరావత వెంకన్న, ఆయన కుమారుడు దీపక్‌, స్నేహితులు ధరావత రాజేష్‌, ధరావత సురేశ, జర్పుల ప్రవీణ్‌లు కూర్చొని మద్యం తాగుతూ పెద్దగాఅరుస్తూ శేషు బైక్‌ను ఆపారు. భూతగాదాలు మనసులో పెట్టుకుని దీపక్‌ వరుసకు సోదరుడైన శేషుతో గొడవ పెట్టుకున్నాడు. రాజేష్‌, సురేశ, ప్రవీణ్‌లు శేషును పట్టుకోగా, దీపక్‌ తన స్కూటర్‌లో ఉన్న కత్తిని తీసి శేషును పొడిచాడు. వెంటనేదీపక్‌ తన తండ్రి వెంకన్న, తల్లి సుజాతలను పిలువగా శేషు భయంతో పారిపోయి తండాలోని వాంకుడోత రంగా ఇంటి వెనుక ఉన్న గుడిసెలోకి వెళ్లి దాక్కున్నాడు. దీపక్‌, తల్లిదండ్రులు వెంకన్న, సుజాతలు వెంబడించి గుడిసెలో దాక్కున్న శేషును కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి, మర్మాంగాలు పిసికి హత్యచేశారు. ఈ క్రమంలో శేషు అరుపులు విని ఆయన భార్య ధరావత లలిత అక్కడికి వెళ్లటంతో నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శేషును తండావాసులతో కలిసి కుటుంబ సభ్యులు సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్తను మృతుని మరో బాబాయి ధరావత శ్రీను ప్రోత్సాహంతో వెంకన్న దీపక్‌, సుజాత మరికొందరిరతో కలసి పథకం ప్రకారం హత్య చేశారని భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ రాజశేఖర్‌ పరిశీలించారు. శేషుకు, నిందితులు దీపక్‌, వెంకన్నలకు 2017నుంచి భూతగాదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీనాయక్‌తండాలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా లక్ష్మీనాయక్‌ తండాలో ఆత్మకూరు, పెనపహడ్‌ రూరల్‌ ఎస్‌ఐలతో పాటు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 02 , 2025 | 12:14 AM